అడ్డగోలు ఆక్రమణ
- పంట భూములుగా మారిన చెరువు గర్భం
- కోల్పోయిన నీటి నిల్వ సామర్థ్యం
- ఆయకట్టు రైతులకు ఇక్కట్లు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం
బుచ్చెయ్యపేట : అది దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉన్న చెరువు. దాదాపు ఏడెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ చెరువు కింద వందెకరాల ఆయకట్టు భూమి ఉంది. అంతటి ప్రాధాన్యం ఉన్న చెరువు ప్రస్తుతం అక్రమార్కుల బారిన పడింది. ఇంత జరిగినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడం విశేషం. మండలంలోని శింగవరం సాంబన్న చెరువు కథ ఇది.
వివరాల్లోకి వెళితే... సాంబన్న చెరువు ఆధారంగా శింగవరం, లోపూడి, లూలూరు రెవెన్యూ పరి ధిలోని వందల మంది రైతులు పంటలు పం డించుకుంటున్నారు. ఏడెకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో దాదాపు మూడున్నర ఎకరాల భూమిని కొందరు రైతులే ఆక్రమించి చెరకు, సరుగుడు తోటలు వేసేశారు. ఈ భూమి విలు వ దాదాపు కోటిన్నర ఉంటుందని అంచ నా. ఆక్రమణలతో ఆయకట్టుకు నీరందక పోవడంతో గత సర్పంచ్ గుడాల అప్పన్నదొర, ప్రస్తుత సర్పంచ్ రేణం అప్పారావు, గ్రామ నాయకులు, యువకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆక్రమణలు తొలగించి సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కానీ రెవెన్యూ అధికారులు ఇసుమంత కూడా స్పందించలేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారి నుంచి స్పందన లేకపోవడంతో అధికారుల తీరుకు నిరసనగా మరికొందరు రైతులు మిగిలిన మూడున్నర ఎకరాల చెరువు గర్భాన్ని ఆక్రమించి సాగుయుక్తం చేసేశారు. ఇందులో యూకలిప్టస్, సరుగుడు, టేకు మొక్కలు వేసి కంచెవేశారు. ప్రస్తుతం ఏడెకరాల చెరువు గర్భం ఆక్రమణకు గురై నీటినిల్వ సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో వందెకరాల ఆయకట్టుకు నీటి పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. విషయాన్ని బుచ్చెయ్యపేట తహశీల్దార్ ఎస్.సిద్ధయ్య వద్ద ప్రస్తావించగా ఆక్రమణలపై ఫిర్యాదు అందిందని చెప్పారు. చెరువు కొలతలు చేపట్టి ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా తొలగేందుకు నిరాకరిస్తే కేసులు నమోదు తప్పదని హెచ్చరించారు.
ఫిర్యాదులు పట్టించుకోలేదు
చెరువు ఆక్రమణలు తొలగించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. చెరువు పూర్తిగా ఆక్రమించేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా ఆయకట్టుకు నీరెలా అందుతుంది. పంటలు ఎలా పండిస్తాం.
- కొమర అప్పారావు, సాగురైతు
ఒకరిని చూసి ఒకరు
తొలుతు సగం చెరువుగర్భాన్ని కొందరు రైతులు ఆక్రమించా రు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదు. అధికారుల తీరుకు నిరసనగా మరికొందరు మిగిలిన చెరువు గర్భాన్ని ఆక్రమించేశారు.
- రేణం నాయుడు, రైతు