సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతాంగంపై ఇక పోలీసు నీడ పడనుంది. రైతులు నీటిని ఏ విధంగా వాడుకుంటున్నారన్న విషయంపై రెవెన్యూ, పోలీసు అధికారులు నిఘా ఉంచి అవసరమైతే కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. బుధవారం ఖమ్మంలో జరిగిన సర్కిల్‌స్థాయి ఎన్నెస్పీ అధికారుల సమావేశంలో ప్రాజెక్టు సీఈ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మూడో జోన్ పరిధిలో ఉన్న భూములకు నీరందడం లేదని, ఇందుకు రెండో జోన్‌లో రైతులు ఎక్కువగా నీటిని వినియోగించడమే కారణమనే భావనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే... ఇక నుంచి రైతులు తమ పొలాల పక్కనే ఉన్న కాల్వల్లోంచి వెళుతున్న నీటిని పొలాల్లోకి మళ్లించుకునే ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై జిల్లాలోని రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు భగ్గుమంటున్నాయి.
నీటిని వాడేసుకున్నారని...!
జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో 16 మండలాలున్నాయి. ఈసారి రబీకి నీటిని విడుదల చేయడంతో అన్ని మండలాల్లో వరి ముమ్మరంగా సాగు చేశారు. ఆయకట్టులో 50 వేలకు పైగా ఎకరాల్లో వరి సాగవుతోంది. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు ముందే ప్రకటించారు. గత పరిస్థితుల నేపథ్యం, సాగర్ రిజర్వాయర్‌లో రబీకి సరిపడ నీళ్లుండడంతో ఎలాగైనా వరి పంట చేతికొచ్చే వరకు నీళ్లు విడుదల చేస్తారన్న ఉద్దేశంతో రైతులు వరి సాగు చేశారు.
జిల్లాలో సాగర్ ఆయకట్టు చివరలో ఉన్న బోనకల్, ఎర్రుపాలెం, కల్లూరు మండలాల్లో కూడా రైతులు ధైర్యం చేసి వరి సాగు చేశారు. వరితో పాటు మిర్చి, మొక్కజొన్న, చెరకు పంటలను కూడా సాగుచేశారు. అయితే, ఫిబ్రవరి నెలాఖరు నాటికి రెండోజోన్ పరిధిలో 8 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోవాలని సాగునీటి శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ పంటలను కాపాడుకోవడంలో భాగంగా రైతులు అవసరాల దృష్ట్యా ఇప్పటికే ఆ నీటినంతటినీ వినియోగించుకున్నారు.
ఈ నేపథ్యంలో మరో నెలరోజుల పాటు ఇంకా నీటిని తమ పొలాలకు వాడుకోవలసిన పరిస్థితి ఉంది. అయితే, మూడో జోన్ పరిధిలో ఉన్న తిరువూరు, నూజివీడు వరకు రబీ నీరందాలని, రెండోజోన్ రైతులు ఇంకా నీటిని వినియోగించుకుంటే ఆ భూములకు నీరందడం కష్టమనే నెపంతో ఇప్పుడు పోలీసులచే బల ప్రయోగం చేయించేందుకు సాగునీటి శాఖ సన్నద్ధమవుతోంది.
పహారా సాగుతుందిలా....
ప్రధానకాల్వ నుంచి మేజర్లు, మైనర్ కాల్వలకు నీటిని అక్రమంగా మళ్లించకుండా మేజర్ల వద్దనే పోలీస్ గస్తీని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీసు సహకారంతో రైతులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాత్రి వేళల్లో రైతులు షట్టర్లు లేపి నీటిని తీసుకెళుతున్నారని, మోటార్లు బిగించి నీటిని తోడేసుకుంటున్నారని కేసులు నమోదు చేసే ఆలోచన చేస్తున్నారు.
అయితే, ఈ కేసులు పెట్టే దాని కన్నా రైతుల అవసరాలకు తగినంత నీటిని విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రబీ సీజన్ ప్రణాళిక రూపొందించుకున్నప్పుడే రెండోజోన్ పరిధిలోని రైతాంగానికి అవసరమైన నీటిని అంచనా వేసి ఆ మేరకు కేటాయిస్తే ఈ సమస్యే ఉండేది కాదని రైతు సంఘాల నేతలంటున్నారు. అవసరానికి తగినట్లు నీటిని ఇవ్వకుండా ఇప్పుడు ఎక్కువ నీటిని వాడుకుంటున్నారని కేసులు పెట్టే యోచన చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
సాగర్ కాల్వల నుంచి నీటిని పొలాలకు వినియోగించుకుంటారే తప్ప తమ ఇళ్లకు తీసుకెళ్లి ఇతర అవసరాలకు వినియోగించుకోరు కదా అనే ప్రశ్నకు అటు రెవెన్యూ, ఇటు ఎన్నెస్పీ అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది. సాగు నీటికి కూడా అధికారులు.. పోలీస్ పహారా పెట్టాలని నిర్ణయించడంపై సంఘాల నేతలు మండిపడుతున్నారు.
చివరి ఆయకట్టుకు కష్టమే..
ఎన్నెస్పీ అధికారులు పోలీస్ పహారాలో నీటిని విడుదల చేస్తే జిల్లాలో చివరి ఆయకట్టుకు నీరందడం కష్టమే. గతంలో ఖరీఫ్, రబీలో కల్లూరు డివిజన్‌లో చివరి ఆయకట్టు భూములకు నీరందక వరి పంట చేతికి వచ్చే సమయంలో నిలువునా ఎండిపోయింది. రైతులు నీటి కోసం ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు అధికారులు మూడో జోన్‌కు నీరందించడానికే పోలీస్ పహారా పెట్టేందుకు యోచిస్తున్నా.. దీని ప్రభావం చివరి ఆయకట్టు భూములపై పడనుంది. చివరి ఆయకట్టు భూముల్లో ఇప్పటికే వరి నాట్లు పూర్తి అయ్యాయి.
ఆరుతళ్లు ఇచ్చినా బోరు, బావుల సాయంతో పంట చేతికి వస్తుందన్న ధీమాతో రైతులున్నారు. ఖరీఫ్‌లో పంటలు సాగు చేసి అకాల వర్షాలతో పంట చేతికి అందక సాగర్ ఆయకట్టులోని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు ఆయకట్టుకు నీరు సక్రమంగా అందకపోతే కనీసం పెట్టుబడి కూడా చేతికి రాక రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఎట్టిపరిస్థితులలోనూ జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించాల్సిందేనని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
సాగర్ కాల్వపై ఖాకీ కన్ను!
Published Thu, Jan 30 2014 2:04 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement