గోదాముల్లో హద్దు దాటుతున్న అవినీతి
సాక్షి, అనంతపురం : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రాయలసీమ జిల్లాల సరిహద్దులోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిపోతోంది. నిత్యావసర సరుకుల గోదాముల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న 231 మండలాలకు 96 చోట్ల మండల లెవల్ స్టాక్ పాయింట్లు (ఎంఎల్‌ఎస్) ఉన్నాయి. ఇక్కడికొచ్చే నిత్యావసర సరుకులను రేషన్ షాపులకు ప్రతినెలా సరఫరా చేస్తుంటారు.
బియ్యం, చక్కెర సహా ఇతర వస్తువులను క్వింటాళ్ల కొద్దీ తూకం వేసి డీలర్లకు అందించాలి. చాలా గోదాముల్లో నిర్వాహకులు (డిప్యూటీ తహశీల్దార్లు) తూకాలు వేయకుండానే అందిస్తున్నారు. డీలర్లు సైతం నమ్మకమే తూకంగా సరుకులను వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. ఇంటికెళ్లిన తరువాత బస్తాల్లో తక్కువ వచ్చిన బియ్యాన్ని చూసి కంగుతింటున్నారు. ఈ భారాన్ని పూడ్చుకునేందుకు ప్రతినెలా కార్డుదారులకు కోత వేస్తున్నారు. కొందరైతే అసలే ఎగ్గొడుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉంటోంది.
ఎందుకిలా?
తూకాల్లో మోసాల నివారణకు రెండేళ్ల క్రితం సీమ పరిధిలోని అన్ని గోదాములకు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు పంపిణీ చేశారు. ఇవి నెలలు కూడా గడవకముందే మూలకు చేరాయి. కొన్నిచోట్ల ఉన్నా..విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో ఉపయోగపడటం లేదు. ఈ పరిస్థితి గోదాముల ఇన్‌చార్జ్‌లకు వరంగా మారింది. డీలరుకు అందే బియ్యం బస్తా బరువు కచ్చితంగా 50 కిలోల 660 గ్రాములు ఉండాలి. ఇందులో 660 గ్రాములు సంచి బరువుగా పరిగణిస్తారు. ఏ గోదాములోనూ ఈ మేరకు ఇవ్వడం లేదు. రెండు కిలోలు తక్కువ ఇస్తున్నారు. ఇలా బొక్కుతున్న బియ్యాన్ని ఆయా జిల్లాల సరిహద్దులు దాటిస్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా 38,37,180 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతినెలా ప్రభుత్వం 59,594 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. 50 కిలోల బస్తాకు రెండు కిలోల చొప్పున బొక్కుతున్న గోదాము ఇన్‌చార్జ్‌లు మొత్తం 59,594 మెట్రిక్ టన్నుల బియ్యంపై 23,83,760 కిలోలు (దాదాపు 2,384 మెట్రిక్ టన్నులు) కొట్టేస్తున్నారు. ఈ బియ్యాన్ని పొరుగు రాష్ట్రాల్లో కిలో రూ.10-12లకు విక్రయిస్తున్నారు.
త ద్వారా నెలకు దాదాపు రూ. 2.50 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు పంపకాలు ఉండటంతో ఎవరూ నోరుమెపడం లేదన్న విమర్శలున్నాయి. అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు చేరుతున్న చౌక బియ్యాన్ని అక్కడి మిల్లర్లు రీసైక్లింగ్ చేస్తున్నారు. వాటిని మిల్లింగ్, పాలిషింగ్ చేసిన త ర్వాత సన్నబియ్యం పేరిట తిరిగి సీమ పరిధిలోని వ్యాపారులకు కిలో రూ.29-30 చొప్పున విక్రయిస్తున్నారు.
దాడులు శూన్యం
రేషన్ బియ్యం పెద్దఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నా అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. కాసులకు కక్కుర్తి పడి గోదాము ఇన్‌చార్జ్‌లకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
డీలర్లకు ఎంత బియ్యం సరఫరా అవుతోంది..కార్డుదారులకు ఏ మేరకు విక్రయిస్తున్నారనే విషయాలపై పక్కాగా రికార్డులు పరిశీలన చేయాల్సివున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై అనంతపురం జిల్లా సివిల్‌సప్లయీస్ జిల్లా మేనేజర్ వెంకటేశంను ‘సాక్షి’ వివరణ కోరగా.. గోదాములను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. బస్తాల్లో బియ్యం తక్కువగా వచ్చినట్లు తెలిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.