సాక్షి, అనంతపురం : నిరుపేదలకు అందాల్సిన చౌక బియ్యం బడాబాబుల చేతుల్లోకి వెళ్తోంది. కొందరు డీలర్లు.. అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులతో కలిసి రేషన్ బియ్యాన్ని అక్రమమార్గంలో నేరుగా మిల్లులకు చేరుస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. అప్పుడప్పుడు అధికారులు చిన్నా చితక దాడులు చేయడం మినహా పెద్దగా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 2,862 చౌక డిపోలుండగా 10.50 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 14.500 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లకు చేరుతోంది. ఇందులో 5,500 మెట్రిక్ టన్నులు దారిమళ్లుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
ఈ బియ్యాన్ని అనంతపురంలోని కొందరు మిల్లర్లు, కర్ణాటకలోని పావగడ, బళ్లారి, బెంగళూరు, తుముకూరు ప్రాంతాల్లోని మిల్లర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కార్డుదారులకు కిలో బియ్యం కూడా పంపిణీ చేయకుండా డీలర్లు నల్లబజారుకు తరలించినట్లు అధికారులకు ఫిర్యాదులు రావడంతో వారు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం జిల్లాలో ఎక్కువ మంది డీలర్లు కాంగ్రెస్, టీడీపీ మద్దతుదారులుగా విడిపోయారు. వారే పరస్పరం అధికారులకు ఉప్పందిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా రెండు పార్టీల ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఆటోలు పట్టుబడుతున్నాయి.
మచ్చుకు కొన్ని ఘటనలు :
*ఈ నెల 13న రాత్రి అనంతపురం శివారులో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. అందులోని 165 బస్తాల చౌక బియ్యం సీజ్ చేశారు.
*రు నెలల క్రితం ఉరవకొండకు చెందిన రైస్ మిల్లర్లు చౌకబియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న విషయం తెలుసుకున్న సివిల్ సప్లైయ్స్ అధికారులు దాడులు చేసి బియ్యంతో పాటు రూ.30 లక్షలు విలువ చేసే రైస్ మిల్లర్ ఆస్తులు సీజ్ చేశారు.
*రెండు నెలల క్రితం గుత్తి మండలం కరిడికొండ నుంచి అనంతపురం వైపు చౌక బియ్యం లోడుతో వస్తున్న ఐషర్ వాహనాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇందులోని 165 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇదే నెలలో కరిడికొండ నుంచి గుత్తి వైపు వస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో 65 బస్తాల చౌక బియ్యం పట్టుబడింది.
*20 రోజుల క్రితం అనంతపురం నుంచి కదిరి వైపు బియ్యం లోడుతో వెళ్తున్న ఆటోను ఎస్కేయూ వద్ద అధికారులు పట్టుకున్నారు.
డీలర్లకు సహకరిస్తున్న
స్టాక్‌పాయింట్ ఇన్‌చార్జ్‌లు!
జిల్లాలో ఎక్కడో ఒక చోట తరచూ అక్రమంగా తరలిపోతున్న చౌక బియ్యం పట్టుబడుతున్నా.. రేషన్ డీలర్లు మాత్రం తమ వ్యాపారాన్ని ఆపడం లేదు. డీలర్లకు స్టాక్‌పాయింట్ల ఇన్‌చార్జ్‌లే సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆరు నెలల క్రితం కదిరి సమీపంలోని ఓడీచెరువు స్టాక్ పాయింట్‌లో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి సుమారు 200 టన్నుల బియ్యం తక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన స్టాక్ పాయింట్ల ఇన్‌చార్జ్‌ల అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే అక్రమార్కులపై అధికారులు ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా జిల్లాలో బియ్యం మాఫియా రాజ్యమేలుతూ రూ. కోట్లు గడిస్తున్నారు. నెలకు ఒక్కో డీలర్ సగటున 35 నుంచి 40 బస్తాల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారన్న ఆ రోపణలు ఉన్నాయి.
రవాణా ఖర్చులు కలిసొస్తాయని ఇద్దరు..ముగ్గురు డీలర్లు కలిపి ఒకే లా రీ/మినీ వ్యాన్లలో మిల్లులకు బియ్యం తరలిస్తున్న ట్లు తెలిసింది. కొన్ని చోట్ల ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచే నేరుగా మిల్లులకు చేరుతున్నట్లు సమాచారం. ముందుగాానే ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బియ్యం కోటాలో కోత కోసి అక్కడి నుంచే నేరు గా మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఓ మంత్రి ముఖ్య అనుచరుడు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి.