
ఆక్వా రైతుకు కరెంటు కష్టాలు
వెంకటాచలం/తోటపల్లిగూడూరు,న్యూస్‌లైన్: విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఆక్వారైతులకు కంటిమీద కునుకు కరువవుతోంది. ప్రధానంగా ఆ శాఖ అధికారులు ఆక్వారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎక్కువసేపు సరఫరా నిలిపివేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆక్వారైతులు తిరుగుబాటు స్వరం వినిపించి విద్యుత్ శాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. వెంకటాచలం, తోటపల్లిగూడూరు మండ లాల్లో ఆక్వాసాగు విస్తారంగా సాగుతోంది.
వేలాది ఎకరాల్లో వెనామీ రొయ్యలు సాగుచేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో లక్షల సంఖ్యలో పిల్లలను పోస్తుండడంతో గుంటలో నీటి మట్టం తగ్గకుండా పర్యవేక్షించడంతో పాటు నిరంతరం ఏరియేటర్లను ఆడించాల్సిన పరిస్థితి. రైతుల అవసరాలను గమనించిన విద్యుత్ శాఖ అధికారులు 24 గంటలూ సరఫరా చేస్తామని చెప్పి డిపాజిట్లు, అడిషనల్ లోడ్ సర్‌చార్జీలు, సర్వీసు చార్జీలు అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పలువురు రైతులు 25 కిలోవాట్ల నుంచి 100 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లను లక్షలాది రూపాయలు చెల్లించి ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇండస్ట్రీయల్ విభాగం కింద డిపాజిట్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాల్సిన అధికారులు కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అది కూడా నిర్ధిష్ట సమయంలో లేకపోవడంతో ఆక్వా రైతుల అవస్థలు వర్ణణాతీతం. ఈ పరిస్థితుల్లో తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి రొయ్యలు మృత్యువాతపడుతున్నాయి. ఈ నష్ట నివారణకు రైతులు ఆయిల్ ఇంజన్లు, జనరేటర్లు వినియోగిస్తుండడంతో పెట్టుబడి తడిచిమోపెడవుతోంది.
రేయింబవళ్లు రొయ్యలను కంటిపాపలా కాపాడుకుంటూ పెంచుతుంటే విద్యుత్ శాఖ అధికారుల తీరుతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్వా రంగానికి నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.