
కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తాం: డీఎస్
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడం, చేయకపోవడం ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇష్టమని మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ (డిఎస్) అభిప్రాయపడ్డారు. శనివారం డిఎస్ హైదరాబాద్లో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ప్రస్తుతం కేసీఆర్ ఏం మాట్లాడిన ఆయన విజ్ఞతకే వదిలేస్తామని డిఎస్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం
పుట్టిన పార్టీ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఆ పార్టీ పని అయిపోయిందని డీఎస్ చెప్పారు.తెలంగాణ కోసం కేవలం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్ప మరెవరూ కారణం కాదని డీఎస్ పేర్కొన్నారు.