- రోడ్డు ప్రమాదంలో దంపతులు, కుమార్తె మృతి
- అనాథగా మిగిలిన కుమారుడు
దైవ దర్శనానికి బయలుదేరినవారిని విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పన్నెండేళ్ల బాలుడు అనాథగా మారాడు.
చిత్తూరు (కొంగారెడ్డిపల్లె), న్యూస్‌లైన్: చిత్తూరులోని గిరింపేటకు చెంది న శ్రీనివాసన్ (45) నగరంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య రాజేశ్వరి(40), కుమారుడు అక్షయ్‌కుమార్ (12), కుమార్తె రోహిణి(9) ఉన్నారు. ఆదివారం సా యంత్రం శ్రీనివాసన్ భార్య రాజేశ్వరి (40), కుమార్తె రోహిణి (9)తో కలిసి మురకంబట్టులోని మునీశ్వర దేవాల యానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. కట్టమంచి వెంకుశా కల్యాణ మండపం ఎదురుగా చిత్తూరు- తిరుపతి రహదారి మలుపు వద్ద టమాట లోడ్‌తో వెళుతున్న లారీ (ఏపీ03 టీఏ 2889) ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో శ్రీనివాసన్, రాజేశ్వరి, రోహిణి అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు.
లారీ ముందు చక్రం రాజేశ్వరి మీదుగా వెళ్లింది. అలాగే రోడ్డుపై పడ్డ శ్రీనివాసన్, రోహిణి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజేశ్వరి, రోహిణి అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు 20 నిమిషాలు మృత్యువుతో పోరాడిన శ్రీనివాసన్ చివరికి మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. సంఘటన స్థలాన్ని చిత్తూరు ట్రాఫిక్ సీఐ వి.వి.గిరిధర్, ఎస్‌ఐ వేణుగోపాల్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జాడలేని అంబులెన్స్
ప్రమాదం జరిగిన కొంతసేపటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే 108 అంబులెన్‌స సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎంతకీ అంబులెన్‌స జాడలేదు. ఈ క్రమంలో 20 నిమిషాలు మృత్యువుతో పోరాడిన శ్రీనివాసన్ మృతి చెందాడని ఆయన బంధువులు తెలిపారు. ఆఖరికి మృతదేహాలను పోలీసులు ప్రయివేటు అంబులెన్‌స ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఒక్కడు మిగిలాడు
శ్రీనివాసన్ కుమారుడు అక్షయ్‌కుమార్ (12) ఆదివారం సెలవు కావడంతో మురకంబట్టులోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శ్రీనివాసన్, రాజేశ్వరి, రోహిణి మాత్రమే ఆలయానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. తల్లిదండ్రులు, చెల్లిని కోల్పోయిన అక్షయ్ కుమార్ ఒంటరివాడయ్యాడు. ఇక తన వారు లేరని తెలిసి బోరున విలపించాడు.