
దళితులను కించపరచడం తగదు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం తగదని.....
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి
బుచ్చిరెడ్డిపాళెం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం తగదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు దళితులను చంద్రబాబు కించపరిచేలా మాట్లాడినందుకు నిరసనగా శనివారం బుచ్చిరెడ్డిపాళెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కులరాజకీయాలు చేస్తున్నారన్నారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. అంబేడ్కర్ రచిం చిన రాజ్యాంగ సూత్రంతో అందరూ సమా న భావంతో మెలుగుతుంటే, వారి మధ్య చంద్రబాబునాయుడు కుల అంతరాల చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారన్నారు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ వారిని అవహేళన చేస్తూ చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు.
దళితుడిగా పుట్టాలని కోరుకుంటున్నా
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ మరో జన్మంటూ ఉంటే దళితుడిగా పుట్టాలని కోరుకుంటున్నానన్నారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన అగ్రకులాల వాళ్లు నేడు దళితులను కించపరిచేలా మాట్లాడడం దారుణమన్నారు. ఇక మీదట కులాల పేరుతో దూషిస్తే వారిని బహిరంగంగా కాల్చివేయాలన్నారు. సభ్య సమాజం తలదించేలా మాట్లాడిన చంద్రబాబునాయుడు దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దళితులను కించపరచడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లేనని తెలిపారు. దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరన్న చంద్రబాబుకు దళితులే తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, నాపా వెంకటేశ్వర్లునాయుడు, సూరా శ్రీనివాసులురెడ్డి, గొల్లపల్లి విజయ్‌కుమార్, కోడూరు మధుసూదన్‌రెడ్డి, అనపల్లి ఉదయ్‌భాస్కర్, స్వర్ణా సుధాకర్‌బాబు, చీమల రమేష్‌బాబు, షేక్ అల్లాబక్షు, జెడ్పీటీసీ సభ్యులు రొండ్ల జయరామయ్య, వెంకటరమణయ్య, దేవసహాయం పాల్గొన్నారు.