
అంబేద్కర్ చిరస్మరణీయుడు: వైవీ
విజయవాడ: భారతీయుల గుండెల్లో అంబేద్కర్ చిరస్మరణీయుడని, ఆయనకు మరణం లేదని ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. విలేకరులతో మాట్లాడుతూ..అంబేద్కర్ ఆలోచనలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునికి పుచ్చుకొని పని చేశారని వైవీ తెలిపారు. పేద, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం దళితుల పట్ల కపటనాటకం ప్రదర్శిస్తుందని విమర్శించారు. దళితులకు ఒక్క ఇల్లు కూడా కట్టని చంద్రబాబు తాను మాత్రం విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మేల్యేలను మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన చంద్రబాబుకి రాజ్యంగ పట్ల ఎంత గౌరవం ఉందో అర్దమౌతుందన్నారు. తెలుగదేశంలో సరైన నాయకులు లేరని అందుకే వైఎస్సార్సీపీ నుంచి గెలిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులని విస్మరిస్తోందని, ఇది ముమ్మాటికీ దళిత వ్యతిరేక ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు.