లయ తప్పుతోంది!
మసకబారుతున్న జీవీఆర్ సంగీత కళాశాల ప్రతిష్ట
పాఠాలపై శ్రద్ధ పెట్టని అధ్యాపకులు
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కార్యక్రమాలు
విజయవాడ కల్చరల్ : రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రతిష్ట మసకబారుతోంది. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, సంగీత విద్వాంసులు కేవీ రెడ్డి, అన్నవరపు రామస్వామి వంటి మహానుభావుల ప్రోత్సాహంతో ఉన్నతమైన ఆశయంతో ఏర్పడిన ఈ కళాశాల నేడు కొందరి ఇష్టానుసారంగా నడుస్తోంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి వంటి దిగ్గజాలు ప్రిన్సిపాళ్లుగా పనిచేసి తమకు వచ్చిన విద్యనంతా విద్యార్థులకు నేర్పించాలని పరితపించారు. ప్రస్తుతం కొందరు అధ్యాపకులు ఇంటి వద్ద ప్రయివేటుగా పాఠాలు బోధిస్తూ కళాశాలలో తరగతులపై పెద్దగా శ్రద్ధచూపడం లేదు.
ప్రయివేటుగా పాఠాలు..
సంగీత కళాశాలలో రోజూ రెండు షిఫ్ట్‌లు ఉంటాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులతోపాటు ఆసక్తిగల గృహిణులు తమకు అనుకూలమైన షిఫ్టులో సంగీతం, నాట్యం, వీణ, గాత్రం, మృదంగం తదితర అంశాలు నేర్చుకుంటున్నారు. సంగీతం, వీణ, నాట్యానికి సంబంధించిన కొందరు అధ్యాపకులు ఇంటి వద్ద ప్రయివేటుగా పాఠాలుబోధిస్తూ కళాశాలలోని తరగతి గదుల్లో పాఠాలు సరిగా బోధించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సంగీత కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత కళాశాల సంయుక్తంగా నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా హాజరుకావడం లేదు. దీంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించే కార్యక్రమాలు సైతం వెలవెలబోతున్నాయి.
భాషా సాంస్కృతికశాఖ పేరుతో అద్దె ఎగవేసే యత్నం
కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించే వారి నుంచి నామినల్ ఫీజులు వసూలు చేస్తారు. ఈ ఫీజులు చెల్లించకుండా ఉండేందుకు సంగీత, నాట్య కార్యక్రమాలు నిర్వహించే కొంతమంది ‘భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సహకారం..’ పేరుతో బోర్డులు పెట్టి కళాశాలకు అద్దెను చెల్లించడం లేదు. గత దసరా మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు ఇదే చిట్కాను ఉపయోగించారు. సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పరిసర ప్రాంతాల కార్పొరేటర్లు వివిధ కారణాల చూపుతూ నిర్వాహకులతో వాగ్వాదాలకు దిగుతున్నారు.
కళాశాల ఆశయాలకు విరుద్ధంగా కార్యక్రమాలు
సంగీత కళాశాలలో లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదు. కానీ, ప్రతి నెలా సినీ సంగీత విభావరి నిర్వహించే కొంతమంది లౌడ్ స్పీకర్లను వాడుతున్నారు. ఇటీవల కళాశాలలో జరిగిన సినీ సంగీత విభావరి సందర్భంగా స్థానికులు గొడవకు దిగారు. కేవలం సంగీతం, నాట్యం, జానపద కళా రూపాలు మాత్రమే ప్రదర్శించాలన్న నియమం ఉన్నా... కొంతకాలంగా బ్రేక్ డాన్స్‌లు ప్రదర్శిస్తూ సంగీత కళాశాల స్ఫూర్తికి కొందరు పెద్దలు గండికొడుతున్నారు.
శాశ్వత అధ్యాపకుల కొరత : కళాశాలలకు అధ్యాపకుల కొరత ఉంది. కాంట్రాక్టు అధ్యాపకులతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి నామమాత్రపు వేతనంతో ప్రభుత్వం సరిపెడుతోంది. ప్రభుత్వం శాశ్వత అధ్యాపకులను నియమించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కళాశాలలో గతంలో తరగతులు నిర్వహించిన ఓ గదిలో ఏసీ ఏర్పాటుచేశారు. కళాశాల నిధులతోనే అన్ని సదుపాయాలు సమకూర్చారు. భాషా సాంస్కృతిక శాఖాధికారులకు విడిదిగా ఈ గదిని ఉపయోగించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అదే ఖర్చుతో కళాశాల పరిసరాలను శుభ్రం చేస్తే బాగుండేదని విద్యార్థులు చెబుతున్నారు.