సాక్షి, అమరావతి ప్రతినిధి: డేటా స్కాం వ్యవహారంపై తెలంగాణ పోలీసులు సిట్ దర్యాప్తునకు ఆదేశించడంతో రాష్ట్రంలో ఇన్నాళ్లూ అధికార తెలుగుదేశం ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ), ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా బూత్ లెవల్లో ఓటర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏడు నెలలపాటు సేకరించిన ఆ శాఖ కీలక అధికారి ఒకరు వాటిని బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌కు పంపినట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారని ప్రచారం జరుగుతుండటంతో ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలీక వారు హడలిపోతున్నారు. కంప్యూటర్ ఐపీ నెంబర్ల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తే ఏపీలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ వ్యవహారంలో ఇరుక్కునే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. (దేశం దాటిన డేటా చోరీ!)
అధికార పార్టీ పెద్దలతో ఎంతో సన్నిహితంగా తిరిగే సదరు అధికారి తమతో చేయకూడని పనులు చేయించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని నిబంధనలకు విరుద్ధంగా సేకరింపజేసి ఐటీ గ్రిడ్స్ కంపెనీకి చేరవేశారని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా పార్టీ వ్యవహారాలకు వాడుకున్న విషయం ఈ వ్యవహారంతో బయటకు వస్తుందని వారంటున్నారు. మరోవైపు.. ఎస్‌బీ, లా అండ్ ఆర్డర్‌లోని కొందరు పోలీసు అధికారులను సైతం ఇష్టానుసారంగా ఈ వ్యవహారాలకు వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అండ ఉందని ధీమాగా ఉన్న కొందరు పోలీసు అధికారులు సైతం తెలంగాణ సిట్ తమ బండారాన్ని ఎక్కడ బయట పెడుతుందోనని ఇప్పుడు వణికిపోతున్నారు. (ఫారం–7 ఇవ్వడం తప్పుకాదు )
కాగా, డేటా స్కాం బాగోతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సిట్’ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, తెలంగాణ పోలీసులు, వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబును బుధవారం రాత్రి కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లాలోని తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో 120బీ, 418, 420, 380, 409, 166, 177, 188, రెడ్‌విత్ 511 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment