సాక్షి, హైదరాబాద్ : రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన గురువారం సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల డేటాను కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థ తీసుకుందని, ఈ కేసులో ప్రతి అంశంపైనా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డేటా చోరీలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రధాన నిందితుడు అశోక్ అమరావతిలో ఉన్నా...అమెరికాలో ఉన్నా వదిలేది లేదని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే అని, నిందితులు ఎవరైనా వదిలేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని చూస్తున్నామన్నారు. చదవండి...(‘ఐటీ గ్రిడ్స్’పై సిట్)
ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీతో పాటు ఇంకా ఈ కేసులో ఎవరైన ఉన్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా ఉండటంతో తమకు అనేకు అనుమానాలు వచ్చాయన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. సిట్‌లో 9మంది అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారని, అయితే ఈ కేసు దర్యాప్తుపై మీడియా కూడా సంయమనం పాటించాలని స్టీఫెన్ రవీంద్ర కోరారు.
ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎలా వచ్చింది?. విశ్వసనీయంగా ఉంచాల్సిన డేటా ప్రయివేట్ సంస్థకు ఎవరిచ్చారు?. తెలంగాణ ప్రజల డేటాతో ఎవరికి ప్రయోజనం కలిగించాలనుకుంటున్నారు? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టామన్నారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఉందని అన్నారు. ఇక డేటా గ్రిడ్స్ సీఈవో అశోక్ ఎక్కడున్నాడనేది ఇంకా తెలియలేదని, అతడి కోసం గాలిస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఉందని, మరింత సమాచారం కోసం నిపుణుల సహకారం తీసుకుంటున్నామన్నారు.
ఐటీ గ్రిడ్స్ సంస్థపై గతంలో సోదాలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రజల డేటాను గుర్తించామని, ఆ డేటాతో పాటు వారికి చెందిన ఆధార్ వివరాలు ఉన్నాయన్నారు. అలాగే ఈ కేసులో అమెజాన్, గూగుల్ సంస్థలకు నోటీసులు ఇచ్చామని, ఇంకా వాటి దగ్గర నుంచి సమాధానం లేదన్నారు. డేటా చోరీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సేవామిత్రలో ఉన్న కొన్ని యాప్స్ తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసు వివరాలను ప్రతిరోజు తెలియచేస్తామని సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment