విద్యార్థిని మృతిపై కదిలిన జిల్లా యంత్రాంగం
మలినేని కళాశాలకు వచ్చిన కలెక్టర్, ఎస్పీ
ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్న అధికారులు
కళాశాల వద్ద ఆందోళన నిర్వహించిన మృతురాలి బంధువులు
కళాశాలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం
వట్టిచెరుకూరు : మండలంలోని పుల్లడిగుంట గ్రామంలోని మలినేని లక్ష్మయ్య మహిళ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఎన్. సునీత ఆత్మహత్యకుగల కారణాలు తెలుసుకొనేందుకు గురువారం కలెక్టర్ కాంతిలాల్‌దండే, అర్బన్ ఎస్పీ సర్వశేష్ఠ త్రిపాఠి ఇక్కడకు వచ్చారు. బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని నార్నె సునీత బుధవారం కళాశాల పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె మృతికి దారితీసిన పరిస్థితులను కళాశాల ప్రిన్సిపాల్ నుంచి అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ర్యాగింగ్ విషయంపై ఆరా తీశారు. విద్యార్థినులను ఎలా కౌన్సెలింగ్ చేయాలో తెలీదా అంటూ ప్రశ్నించారు. ఆడపిల్లలను కౌన్సెలింగ్ చేసేటప్పుడు వారి తల్లిదండ్రుల సమక్షంలో చేయాలి కదా.. అంటూ కళాశాల ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. వారి వెంట సౌత్ జోన్ డీఎస్సీ శ్రీనివాసరావు, ఆర్డీవో బాస్కర్ నాయుడు, సీఐ రవికుమార్, తహశీల్దార్ సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ప్రేమయ్య తదితరులున్నారు.
వార్డెన్‌పై చర్యలకు డిమాండ్.. మృతురాలు సునీత బంధువులు సుమారు వందమంది గురువారం కళాశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కళాశాల హాస్టల్ వార్డెన్ స్వరూపరాాణి తీరు వల్లే సునీత ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ర్యాగింగ్ నేపథ్యంలో సునీత చనిపోయిందని కళాశాల యాజమాన్యం అసత్యపు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సునీత ది ర్యాగింగ్ చేసే మనస్తత్వం కాదని, చనిపోయిన వారిపై నిందారోపణలు మోపడం సబబు కాదన్నారు. మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. సౌత్ జోన్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ప్రేమయ్య బందోబస్తు నిర్వహించారు.
ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు..
విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో యాజమాన్యం తమ కళాశాల, హాస్టల్‌కు మూడు రోజులపాటు సెలవు ప్రకటించింది. దోషులను కాపాడే ప్రయత్నంలో భాగంగా సెలవులు ప్రకటించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
విద్యార్థిని మృతదేహం అప్పగింత
విద్యానగర్ (గుంటూరు) : గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి మార్చురీలోని సునీత మృత దేహానికి ఆసుపత్రి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు. వట్టిచెరుకూరు మండలం పోలీసులు శవపంచనామాను రాసి మృతురాలి తల్లి అంజమ్మ, మేనమామ శ్రీనివాసరావు, బంధువులకు అప్పగించారు. విద్యార్థిని మృతదేహాన్ని కడసారిగా చూసేందుకు కళాశాలకు చెందిన తోటి విద్యార్థులు భారీ ఎత్తున మార్చురీ వద్దకు తరలివచ్చారు. పోలీసుల సమక్షంలో మృత దేహాన్ని అంబులెన్స్‌లో తరలించారు. చేతికంది వచ్చిన కుమార్తె అకాల మృతి చెందటంతో మృతురాలి తల్లి బంధువులు బోరున విలపించారు. తోటి విద్యార్థులు సైతం కంటనీరు పెట్టుకున్నారు.
ఆత్మహత్యపై ఆరా
Published Fri, Aug 7 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement