అందని సాయం.. మానని గాయం | Deccani cyclone compensation | Sakshi
Sakshi News home page

అందని సాయం.. మానని గాయం

Published Fri, Oct 9 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

Deccani cyclone compensation

అకౌంట్.. ఆధార్ నెంబర్లు లేవని..
వేలాదిమందికి నేటికీ దక్కని తుపాను పరిహారం
చిరునామాలు దొరకలేదంటూ తొలగింపు

 
హుద్‌హుద్.. ఈ పేరు వింటే చాలు జిల్లావాసులు ఉలిక్కిపడతారు. కలలో కూడా నాటి చేదు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పరిహారం అందని వారు వేలల్లో ఉన్నారు. చిరునామాలు దొరకడం లేదనే సాకుతో వేలాదిమంది పేర్లను జాబితాల నుంచి తొలగించేశారు. అకౌంట్లు, ఆధార్ నెంబర్లు సరిగా లేవనే సాకుతో మరికొంతమందికి మొండిచేయి చూపారు.
 
విశాఖపట్నం : హుద్‌హుద్ తుపాను సాయం అందక ప్రతి వారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు అందుతున్న అర్జీలు వందల్లో ఉంటున్నాయి. నాటి దుర్ఘటనలో 49మంది చనిపోగా అందులో నలుగురికి రూ.2 లక్షలు వంతున కేంద్ర సాయం అందాల్సి ఉంది. పూర్తిగా, పాక్షికంగా మొత్తం 1.46,799 ఇళ్లు దెబ్బతిన్నట్టుగా లెక్కతేల్చారు. కానీ కేవలం 1,30,993 ఇళ్లకు మాత్రమే పరిహారం ఇచ్చారు. చిరునామాలు దొరకడం లేదనే సాకుతో 12,010 ఇళ్లను తొలగించగా, ఆధార్ అకౌంట్లు సరిగా లేవనే సాకుతో మరో 3,156 మందిని జాబితాల నుంచి తొలగించారు. ఇంకా 640 మందికి మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందని అధికారులు లెక్కతేల్చారు. బట్టలు, సామాన్లు కోల్పోయిన బాధితుల్లో ఇంకా 631మందికి పరిహారం అందాల్సివుంది.

అతలాకుతలమైన వ్యవసాయం
జిల్లాలో 32,167.756 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిగా, 1,52,806 మందికి పరిహారం చెల్లించాల్సి ఉంది. 581 మంది రైతుల పేర్లను చిరునామాలు దొరకలేదనే సాకుతో తొలగించారు. మరో 593 మంది రైతులకు ఇంకా 30.03 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది.ఉద్యాన పంటలు కోల్పోయిన 9656 మందికి రూ.18 కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది.పశువులు, కోళ్లు చనిపోయిన 223 మందికి పరిహారం అందలేదు.886 మైక్రో ఇండస్ట్రీస్, 514 స్మాల్ ఇండస్ట్రీస్‌కు రూ.4.78 కోట్ల నష్టం వాటిల్లగా ఇప్పటి వరకు ఏ ఒక్క సంస్థకు ఒక్క రూపాయి పరిహారం అందజేయలేదు.

 ఏజెన్సీలోనూ అదే పరిస్థితి
 ఏజెన్సీలో వ్యవసాయ పంటలకు ప్రభుత్వ సాయం నామమాత్రంగానే అందింది. పలుచోట్ల కొండచరియలు, కొండవాగులు కొట్టుకు వచ్చి పొలాల్లో మేటలు వేయడంతో వరి పంటకు ఎక్కువ నష్టం కలిగింది. రాజ్‌మా, చోడి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ భూములు కూడా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ 11 మండలాల్లో 38,174 మంది రైతులకు వివిధ వ్యవసాయ పంటల నష్టంపై రూ.769.91 లక్షలు సాయం అందించింది.
 
వరి పంటకు పరిహారం చెల్లించలేదు
ఎకరం భూమిలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఇంత వరకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. పంట దిగుబడి లేకపోవడంతో ఈ ఏడాది తిండిగింజలు కరువయ్యాయి.
 -పూజారి సూర్యనారాయణ,
 గిరి రైతు, గురుపల్లి గ్రామం
 
 ఈ ఏడాది పంట వదిలేశాం
 ఇసుక మేటలు వేయడంతో వరి పొలం పూర్తిగా పాడైంది. ఎకరానికి రూ.700 నష్టపరిహారం ఇస్తామన్నారు. నేటికీ సాయం అందలేదు. భూమి బాగు చేసుకోవడానికి కూడా సాయం అందక ఈ ఏడాది పంట వేయలేకపోయాం.
 -వారం ఈశ్వరమ్మ, గురుపల్లి గ్రామం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement