రుణ లక్ష్యం రూ.140కోట్లు
అందించింది రూ.71 కోట్లు
తిరోగమనంలో పొదుపు సంఘాలు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో డ్వాక్వా సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయి. రుణమాఫీ దెబ్బకు కొత్త రుణాల్లో కొర్రీ పడింది. స్వయం సహాయక సంఘాల ఖాతాల నుంచి బ్యాంకర్లు ఇప్పటికే పొదుపు సొమ్మును జమచేసుకున్నారు. బ్యాంకర్ల వేధింపుల నేపథ్యంలో మిగిలిన రుణాలను సభ్యులే స్వచ్ఛందంగా చెల్లించారు. ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయల మేర రుణమాఫీ ఇస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా బడ్జెట్‌లో రివాల్వింగ్ ఫండ్‌ను తెరపైకి తెచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఏడు వేల గ్రూపులకు రూ.140 కోట్లు రుణాలుగా అందిచాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,875 గ్రూపులకు రూ.71 కోట్ల మేర మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. అంటే లక్ష్యంలో 50 శాతంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గడిచిన ఆరు నెలల్లో 355 గ్రూపులు రద్దయ్యాయి. మరిన్ని సంఘాలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హామీ మాఫీ
అధికారుల అలసత్వం కారణంగానే డ్వాక్వా సంఘాలు పరిస్థితి అధ్వాన్నంగా తయారైందనే విమర్శలు ఉన్నాయి. ఏడాది నుంచి అధికారులు బ్యాంకర్లతో సమావేశాన్ని ఏర్పాటుచేసిన దాఖలాల్లేవు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.130 కోట్లు రుణ లక్ష్యం కాగా రూ.101 కోట్లు పంపిణీ చేశారు. దీనిపై నాటి కమిషనర్ సి.హరికిరణ్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పీవో ఎం.శకుంతల ఏమాత్రం దృష్టిసారించలేదు. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ హామీలను మాఫీ చేసి రుణాలను మిగిల్చింది. దీంతో బ్యాంకర్లు మహిళల పొదుపు ఖాతాల నుంచి బకాయిల్ని మినహాయించుకున్నారు. గతంలో 11,973 గ్రూపులు ఉండగా ప్రస్తుతం 11,618 పనిచేస్తున్నాయి. స్మార్ట్‌సిటీ, బ్యూటిఫికేషన్‌పై అధికారులు చూపుతున్న శ్రద్ధలో కనీసం పది శాతం డ్వాక్వా సంఘాలపై చూపడం లేదు. పీవో ఎం.శకుంతలను సరెండర్ చేసిన కమిషనర్ జి.వీరపాండియన్ ఇన్‌చార్జి బాధ్యతల్ని విజయలక్ష్మికి అప్పగించారు. నెల రోజుల క్రితమే ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరు లోపు రూ.69 కోట్ల రుణాలను అందించాల్సి ఉంది.
నేను కొత్తగా వచ్చా
నెల రోజుల క్రితమే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు. సమీక్షలు, సమావేశాలతోనే టైం సరిపోతుంది. ఇప్పుడిప్పుడే సెక్షన్‌పై అవగాహన వస్తోంది. లక్ష్యసాధన దిశగా రుణాలు మంజూరు చేసేందుకు నావంతు కృషి చేస్తా.
- విజయలక్ష్మి, యూసీడీ ఇన్‌చార్జి పీవో
డ్వాక్వా సంఘాలు ఢమాల్
Published Sat, Mar 14 2015 3:11 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
Advertisement
Advertisement