
పోలీస్ స్టేషన్ వద్ద సీఐతో వాగ్వాదం చేస్తున్న ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి
అనంతపురం, డీ.హీరేహాళ్: ‘నడిరోడ్డుపై మాజీ ప్రజాప్రతినిధి భర్తను కొందరు విచక్షణారహితంగా కొట్టుకుంటూ స్టేషన్ వరకు తీసుకొచ్చినా పోలీసులు చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ఇది ఆంధ్రప్రదేశా.. లేక బిహారా..?’ అంటూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎంపీపీ పుష్పావతి భర్త మహాబలేశ్వరప్పపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్సీ ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ వద్ద అరగంట సేపు ధర్నా నిర్వహించారు. దాడి జరిగి మూడు రోజులైనా నిందితులను అరెస్ట్ చేయలేదని, పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కొంత మంది నాయకులు చిల్లర, కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మాఫియా దొంగలే దాడికి పాల్పడ్డారని, అలాంటి వారిపై పోలీసులకు ఎందుకంత ప్రేమో తెలియడం లేదని మండిపడ్డారు.
బాధితుడి ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదు?
దాడిలో గాయపడిన ఎంపీపీ భర్త స్టేషన్‌కు వచ్చినా ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదని సీఐని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. పోలీసులు రక్షణ కల్పించాల్సిందిపోయి, బాధితులనే భయపెడుతున్నారని విరుచుకుపడ్డారు. ఫిర్యాదుదారు ఏదైతే రాసుకొచ్చారో దాని ఆధారంగా కేసు నమోదు చేయాలన్నారు. అలా కాకుండా ఫిర్యాదు తప్పుగా ఉంది మార్చి రాయాలంటూ చించి వేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఇక్కడి ఎస్‌ఐపైనా, మాజీ ఎంపీపీ భర్తపై దాడి చేసిన వారిపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీఐజీతో పాటు ముఖ్యమంత్రి వరకు సమస్యను తీసుకెళ్తామని హెచ్చరించారు.
కుల రాజకీయాలతో చిచ్చు
ఇక్కడ నాయకులు బీసీ వర్గాల్లో చిచ్చుపెట్టి, విభజించాలని చూస్తున్నారని, దొంగలు, దోపిడీదారులు అరాచకాలు చేస్తున్నా వారికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. మాకు మంత్రి, పోలీసులు, నాయకుల అండ ఉందంటూ ఒక మాజీ ఎంపీపీ భర్తను కొట్టుకుంటూ స్టేషన్ వరకు తీసుకువచ్చినా ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఏమిటి? ఇదేమైనా పాళేగాళ్ల రాజ్యమా? అంటూ సీఐని ప్రశ్నించారు.
రౌడీరాజ్యంలా మారింది..
మాజీ ఎంపీపీ పుష్పావతి మాట్లాడుతూ హీరేహాళ్ రౌడీ రాజ్యంగా మారిందని అన్నారు. పోలీసులు కనీస విలువలు లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బాధితులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అండతోనే, నాయకులు తన భర్తపై దాడిచేయించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నా తమకు రక్షణ లేకుండాపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. మహాబళేశ్వరప్ప మాట్లాడుతూ తనపై దాడి చేసిన వారే తన పొలంలో ఇసుకను తవ్వి తరలించారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాడి చేసిన వారు కళ్ల ముందే దర్జాగా తిరుగుతున్నా పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన తన భార్య, కొడుకుపైనే కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించారని ఆరోపించారు.
చట్ట ప్రకారం చర్యలు
చట్టప్రకారం నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఉన్నతాధికారులకు జరిగిన సంఘటనపై నివేదిక అందిస్తామని ఎమ్మెల్సీకి హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ప్రహల్లాద, చంద్రశేఖర్‌రెడ్డి, హిర్దెహాళ్ మారెన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment