కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుండగా, యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో 75 కేంద్రాలు ఏర్పాటుచేశామని పరీక్షల నియంత్రణాధికారి ఎంవీ.రంగారావు, అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకట్రాంరెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో 41,743 మంది విద్యార్థులు, ఆదిలాబాద్‌లో 35,223మంది, ఖమ్మంలో 30,194 మంది, కరీంనగర్ లో 6,717మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, పరీక్షలు సాఫీగా జరిగేలా పర్యవేక్షించేందుకు స్క్వాడ్ బృందాలతో పాటు పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు వివరించారు.