
'దొంగగా భావించి యువతిని చితకబాదారు'
మణుగూరు : షాపింగ్కు వచ్చిన ఢిల్లీకి చెందిన ఓ యువతిపై ఖమ్మం జిల్లా మణుగూరులో దాడి జరిగింది. తెలుగు భాష రాకపోవడంతో దొంగగా భావించిన ఓ షాపు యాజమాన్యం ఆమెను చితకబాదింది. స్థానిక నీలగిరి సూపర్ మార్కెట్‌లో సరుకులు కొందామని ఢిల్లీకి చెందిన సంజు అనే యువతి వచ్చింది. అయితే ఆమెకు తెలుగు రాకపోవడంతో దొంగగా భావించిన సూపర్‌మార్కెట్ యాజమాన్యం ఆమెపై దాడి చేసింది.
దెబ్బలకు తాళలేక ఆమె బయటకు పరుగెడుతున్నా.. యాజమాన్యం విడిచి పెట్టలేదు. వెంటపడి మరీ ఆమెను చితక్కొట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని నాలుక కరుచుకున్నారు. సూపర్‌మార్కెట్ యాజమాన్యం అత్యుత్సాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సూపర్‌మార్కెట్ యాజమాన్యంపై సంజు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.