- ఆత్మీయ అభిమాన సదస్సులో కేంద్ర మంత్రి వెంకయ్య
విశాఖపట్నం: కుల రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యానికి చేటు చేకూరుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో దీని ప్రభావం ఎక్కువగా చూపుతుందన్నారు. రుషికొండ ప్రాంతం సాయిప్రియ బీచ్ రిసార్ట్స్ వేదికగా ఆదివారం ఏర్పాటైన ఆత్మీయ అభిమాన సదస్సులో ప్రసంగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కులం, ధనం, మద్యం, విందులు ప్రాధాన పాత్ర పోషించాయన్నారు.
ఇలా ఖర్చుచేసి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజా సేవలకు ప్రాధాన్యం ఇవ్వలేరని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు కుర్చీ కోసం కులాన్ని వినియోగించుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి సంస్కృతి మారాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్‌డీఏ మంచి పాలన అందిం చి దేశ ప్రజలకు మేలు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖపట్టణాన్ని సాంస్కృతిక, వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మరో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలించిన కాంగ్రెస్‌ను ప్రజలు ఇంటికి పంపారన్నారు. ఈ సదస్సుకు వెంకయ్యనాయుడితో కలిసి చదువుకున్నవారు, స్నేహితులు, కలిసి పార్టీలో పనిచేసినవారు పెద్ద సంఖ్యలో హాజరై సత్కరించారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని నాలుగు అడుగుల తెలుగుతల్లి విగ్రహాన్ని బహూకరించారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణు కుమార్‌రాజు, లలితకుమారి, బీజేపీ నాయకుడు పి.వి.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ సమస్యలపై వెంకయ్యకు వినతి
సీతమ్మధార : రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎన్‌ఎంయూ ప్రతినిధులు మంత్రి వెంకయ్యను కోరారు. ఈ మేరకు యూనియన్ గౌరవాధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆధ్వర్యంలో రుషికొండలోని సాయిప్రియ రిసోర్ట్స్‌లో వినతి పత్రా న్ని అందజేశారు. సీమాంధ్రలో కొత గా ఆర్టీసీ కేంద్ర కార్యాలయం ఏర్పా టు చేయాలని, కొత్తబస్సులను డిపోలకు ఇవ్వాలని, సీమాంధ్ర ఆర్టీసీని ప్ర భుత్వంలో విలీనం చేసేవిధంగా చర్య లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అంత కు ముందు వెంకయ్యను గజమాలతో సత్కరించారు. ఎన్‌ఎంయూ విజయనగరం జోనల్ కార్యదర్శి పి.వి.వి.మోహన్, రాష్ట్ర కార్యదర్శి కె.నందగోపాల్, సీసీఎస్ బోర్డు సభ్యుడు టి.ఎస్.రావు, రూరల్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి పి.ఎన్.రావు, ఎం.వి.ఆర్.మూర్తి, వాల్తేరు డిపో కార్యదర్శి ఆర్.వసంతరావు, అర్బన్ కార్యదర్శి ఎ.కె.శివాజీ పాల్గొన్నారు.