ఓటు... ప్రజాస్వామ్యానికి పునాది | democracy is the foundation of the vote ... | Sakshi
Sakshi News home page

ఓటు... ప్రజాస్వామ్యానికి పునాది

Published Tue, Mar 25 2014 2:09 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM

democracy is the foundation of the vote ...

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:
ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అని, ఆ హక్కును అందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ కోరారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఓటరు అవగాహన వాల్‌పోస్టర్లను జాయింట్ కలెక్టర్ జి.వీరపాండియన్‌తో కలిసి విడుదల చేశారు.
 
అనంతరం కలెక్టర్ ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగస్వాములైన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిస్తున్నట్లు ఎన్నికల నిర్వహణలో కూడా సహకరించాలన్నారు.
 
10 నియోజకవర్గాలకు నోడల్ ఎన్‌జీఓలను నియమించామని చెప్పారు. ఓటరు అవగాహనకు ర్యాలీలు నిర్వహించాలని, ఇంటింటికీ వెళ్లి ఓటు విలువ తెలియజేయాలని సూచించారు.
 
జిల్లాలో 70 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాలు 700 ఉన్నాయని, అక్కడ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఓటర్లను చైతన్యవంతులను చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ ఓటరు అవగాహనకు సామాగ్రిని తయారు చేస్తున్నట్లు చెప్పారు.
 
పోస్టర్లు, సినీ స్లైడ్‌లతో ప్రచారం చేస్తున్నామన్నారు. గ్యాస్ సిలిండర్లు, దుకాణాలలో విక్రయిస్తున్న వస్తువులపై ఎన్నికల తేదీ ముద్రతో స్టిక్కర్లు వేయిస్తామని చెప్పారు. డ్వామా పీడీ ఎ.కల్యాణచక్రవర్తి మాట్లాడుతూ ఉపాధి పనులు చేస్తున్న కూలీలందరికీ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
 
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సిహెచ్.ఆనంద్‌కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎన్.సన్యాసిరావు, వి.సాంబమూర్తి(బ్రెడ్స్), కొమ్ము రామ్మూర్తి(స్వీప్), జి.నరసింహమూర్తి(హెల్పింగ్ హ్యాండ్స్), వి.శంకరరావు(గైస్ట్), ఎం.సన్యాసిరావు(భవిత) తదితరులు పాల్గొన్నారు.
 
ప్రలోభాలకు లొంగొద్దు
ప్రలోభాలకు లొంగి ఓటు హక్కును దుర్వినియోగం చేయవద్దని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. ‘ఓటు హక్కు అమ్ముకోవద్దు’ అనే నినాదంతో జైభారత్ సామాజిక వేదిక రూపొందించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
 
ఈ గోడ పత్రిక ఓటర్లలో అవగాహన కల్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వీరపాండియన్, డీపీఆర్‌వో రమేష్, జైభారత్ కన్వీనర్ జి.వి.నాగభూషణరావు, శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్ అభ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement