ఓటనే వజ్రాయుధాన్ని ప్రయోగించండి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, ఓటనే వజ్రాయుధాన్ని ప్రయోగించి మంచివారిని ఎన్నుకోవాలని కలెక్టర్ సౌరభ్ గౌర్ అన్నారు. మంగళవారం ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ అవగాహన కార్యక్రమం అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు ఓటర్లు లొంగకుండా నిజాయితీగా ఎవరు మేలు చేస్తారో గుర్తించి వారికి ఓటు వేయాలన్నారు. పండగ సమయాల్లో ఎంత ఉత్సాహంగా ఉంటామో ఓటు హక్కు వినియోగంలోనూ అలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శించి ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థ దేశంలో బలంగా ఉంద ని, ఓటు హక్కు ద్వారా పాలనలో మార్పు తీసుకురావచ్చన్నారు.
అంతకు ముందు పట్టణంలోని వైఎస్‌ఆర్ కూడలిలో ఓటరు అవగాహనపై కలెక్టర్ బెలూన్లను ఎగురవేసి ప్రతిజ్ఞ ఉన్న కరపత్రాన్ని ఆవిష్కరించారు. ర్యాలీ పాల కొండరోడ్డు మీదుగా అంబేద్కర్ ఆడిటోరియం వరకు నిర్వహించారు. ర్యాలీలో సాని వాడ చెక్క భజన కళాబృందం, జాతీయ నాయకులు, భారతమాత వేషధారణలో చిన్నారులు పాల్గొని ఆకట్టుకున్నారు.
నృత్య శిక్షకుడు శివకుమార్ నేతృత్వంలో ఓటు అవగాహనపై నృత్య ప్రదర్శన చేశారు. వారిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ ఎండీ హసన్ షరీఫ్, డీఆర్‌వో నూర్ భాషా ఖాసి మాట్లాడారు. ఆర్‌డీవో జి.గణేష్, మెప్మా పీడీ సత్యనారాయణ, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, తహశీల్దార్ వీర్రాజు, పి.రమేష్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.