డెంగీ పంజా | Dengue Fevers In East Godavari Villages | Sakshi
Sakshi News home page

డెంగీ పంజా

Published Mon, Sep 3 2018 12:21 PM | Last Updated on Mon, Sep 3 2018 12:21 PM

Dengue Fevers In East Godavari Villages - Sakshi

అంబాజీపేట మండలం మొసలపల్లికి చెందిన డెంగీ బాధితుడు కుడుపూడి వెంకటేశ్వరరావును అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రిలో పరామర్శిస్తున్న అధికారులు

సాక్షి, తూర్పు గోదావరి,రాజమహేంద్రవరం: ఏజెన్సీ, మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా జిల్లాలో ప్రాణాంతక డెంగీ జ్వరం పంజా విప్పుతోంది. దీంతోపాటు వైరల్‌ జ్వరాలు కూడా విస్తృతంగా ప్రబలుతున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో డెంగీ జ్వరంతో నలుగురు మృతి చెందారు. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ 258 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే డెంగీ మరణాలను తక్కువ చేసి చూపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య ఇందులో కలిపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జగ్గంపేట మండలం మల్లిశాలకు చెందిన పాలిపిరెడ్డి నూకరత్నం డెంగీతో కాకినాడ జీజీహెచ్‌లో శనివారం మృతి చెందగా, వైద్య సిబ్బంది మల్లిసాలకు వచ్చి డెంగీతో చనిపోయారంటూ ఎవ్వరికీ చెప్పవద్దన్నారని అంటున్నారు. దీనినిబట్టి డెంగీ మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న వాదనలకు బలం చేకూరుతోంది. మల్లిసాలలో డెంగీ మృతి నమోదు కావడంతో జగ్గంపేట సీహెచ్‌సీ, రాజపూడి పీహెచ్‌సీ వైద్యులు ఆదివారం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు.

జిల్లాను చుట్టుముడుతున్న జ్వరాలు
జిల్లావ్యాప్తంగా డెంగీతోపాటు వైరల్‌ జ్వరాలు ప్రబలుతున్నాయి.
కాకినాడ రూరల్‌లో అత్యధికంగా 85 డెంగీ కేసులు నమోదు కాగా, కాకినాడ నగరంలో 65 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాకినాడ రూరల్‌ మండలం రమణయ్య పేటలో డెంగీ విజృంభిస్తోంది.
జిల్లా కేంద్రమైన కాకినాడ నగరంలోని 31, 32, 33, 34 డివిజన్లలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో అక్కడ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన డెంగీ జ్వర పీడితులు 70 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో వివిధ మండలాల్లో 182 కేసులు నమోదయ్యాయి.
అమలాపురం మున్సిపాలిటీలో ఒకరు డెంగీతో బాధ పడుతున్నారు. పదుల సంఖ్యలో వైరల్‌ జ్వరాల బారిన పడ్డారు.
అల్లవరం మండలం తాడికోన, పెదపేట, వీరమ్మ చెరువుల్లో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి.
మలికిపురం మండలం గుడిమెళ్లంకలో ఇటీవల ఓ వ్యక్తి డెంగీతో మృతి చెందారు.
వైరల్‌ జ్వరాలతో రాజోలు నియోజకవర్గంలోని పలు గ్రామాలు మంచం పట్టాయి.
కె.గంగవరం మండలం యర్రపోతవరంలో డెంగీ జ్వర లక్షణాలు కనిపించడంతో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో ఇద్దరు, బిక్కవోలు మండలం కాపవరంలో ఒకరు డెంగీతో చికిత్స పొందుతున్నారు.
సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవంలో విషజ్వరాలు ఉధృతంగా ఉండడంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు వైరల్‌ జ్వరాలతో అల్లాడిపోతున్నారు.
తుని మండలం ఎస్‌.అన్నవరంలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. బాధితులు చికిత్స పొందుతున్నారు.
పిఠాపురం రూరల్‌ మండలం గోకివాడ, మంగితుర్తి గ్రామాల్లో ఇద్దరికి డెంగీ జ్వరం సోకినట్లు అధికారులు గుర్తించి, కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారు.
అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో నెల రోజుల క్రితం ఓ మహిళ డెంగీతో మృతి చెందింది. తాజాగా ఇదే మండలం మొసలపల్లికి కుడుపూడి వెంకటేశ్వరరావు, మాచవరానికి చెందిన అరుణ్‌బాబు డెంగీ బారిన పడ్డారు. దీంతో ఉలిక్కిపడిన వైద్యాధికారులు బాధితులను అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

ముందు చూపేదీ?
ఏటా వైరల్‌ జ్వరాలు, ప్రాణాంతక డెంగీ, మలేరియా జ్వరాలు పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నా సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో విఫలమవుతున్నారు. గత ఏడాది మన్యంలో మలేరియా, మైదాన ప్రాంతంలో డెంగీ విజృంభించాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. జ్వరాలకు కారణమైన అపరిశుభ్రత, మురుగునీటి నిల్వలను తొలగించే ప్రయత్నం చేశారు. విపత్తు జరిగిన తర్వాత మేల్కొనేలా అధికారుల తీరు ఉంది తప్ప ముందస్తుగా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. నగరాలు, గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. జిల్లాలోని 1,069 పంచాయతీల్లో పాలక మండళ్ల గడువు తీరినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చింది. పాలక మండళ్ల నిర్వహణలోనే అరకొరగా ఉండే పారిశుధ్యం, ప్రత్యేక అధికారుల పాలనతో పూర్తిగా గాడి తప్పింది. పరిస్థితి పూర్తిగా విషమించకముందే ఇప్పటికైనా గ్రామాల్లో డెంగీ జ్వరంపై అవగాహన కల్పించడంతోపాటు, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది.

డెంగీ నివారణకు కృషి
భానుగుడి (కాకినాడ సిటీ): జిల్లాలో డెంగీ వ్యాధి నివారణకు కృషి చేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) డాక్టర్‌ టీఎస్‌ఆర్‌ మూర్తి తెలిపారు. తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్‌ వరకూ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 76, గ్రామీణ ప్రాంతాల్లో 182 కలిపి మొత్తం 258 కేసులు నమోదయ్యాయని వివరించారు. కాకినాడ అర్బన్‌లో 65, రూరల్‌లో 85 కేసులు నమోదయ్యాయని, మొత్తం కలిపి 150 కేసులతో జిల్లాలోనే కాకినాడ ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. పెద్దాపురం అర్బన్‌లో 9, రూరల్‌లో 49 కలిపి మొత్తం 58 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌లో 2, రామచంద్రపురం రూరల్‌లో 33, అర్బన్‌లో 1, అమలాపురం అర్బన్‌లో 1, రూరల్‌లో 10, రంపచోడవరంలో 2, ఎటపాకలో 1 చొప్పున డెగీ కేసులు నమోదయ్యాయన్నారు. ఆగస్టు నెలలో వర్షాలు ఎక్కువగా కురిసి, వాతావరణం మారడంతో డెంగీ కేసులు పెరిగాయని చెప్పారు.

వీటిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. జ్వరం వచ్చినప్పుడు ప్రజలు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లాలో డెంగీ నిర్ధారణ పరీక్ష చేసే పరికరాలు కాకినాడ జీజీహెచ్‌లోనే ఉన్నాయని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని డాక్టర్‌ మూర్తి సూచించారు. డెంగీ సోకినప్పుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, కన్నుగుడ్డు నొప్పిగా ఉండి కదపలేకపోవడం, ఒంటి మీద దద్దుర్లు వంటి లక్షణాలుంటాయన్నారు. డెంగీ జ్వరం ఎక్కువైతే మలంతో రక్తం పడుతుందని, ముక్కు, నోటి నుంచి నీరు కారుతుందని, వాంతులు అవుతాయని చెప్పారు. నగరపాలక, పురపాలక సంస్థల్లో డెంగీ రిపోర్టు అయిన వార్డుల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. జిల్లాలో 31 మొబైల్‌ మలేరియా, డెంగీ క్లినిక్‌ బృందాలు ఏర్పాటు చేశామని, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఇంటింటికీ తిరిగి డెంగీ, మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. డెంగీ దోమ మంచినీటిలో పెరుగుతుందని ఇళ్లలో మంచినీరు నిల్వ ఉంచరాదని, ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగీ దోమ పగటి పూట కుడుతుందని, ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ మూర్తి తెలిపారు. విలేకర్ల సమావేశంలో డీఐఓ డాక్టర్‌ మల్లిక్, పీఓడీటీటీ డాక్టర్‌ సత్యనారాయణ, డెమో శ్రీనివాస్, ఏఎంఓ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement