నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులుండే ఎస్టాబ్లిష్‌మెంట్ (బి సెక్షన్) విభాగం ఆహుతి కావడం వెనుక ఇంటిదొంగలహస్తముండవచ్చని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాకపోవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉద్దేశపూర్వకంగానే రికార్డులకు నిప్పు పెట్టారని అనుమానిస్తున్నారు. వేగంగా మంటలు వ్యాపించేందుకు దోహదపడే వస్తువులను వినియోగించడం వల్లనే మంటలు దావానలంలా వ్యాపించి రికార్డులు, ఫైళ్లు, సర్వీసు రిజిష్టర్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు బూడిదనయిట్లు భావిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కొన్నాళ్లుగా ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది.
దీనికి తోడు గత ఏడాది మొత్తం సస్పెన్షన్‌లకు తెర లేపడం, నకిలీ సర్టిఫికెట్‌లతో ఉద్యోగాలు పొందిన వారు, పదోన్నతులు పొందిన వారిపై విచారణ జరుగుతుండటం.. ఇప్పటికే సీబీసీఐడి అధికారులు రికార్డులను పరిశీలించి దర్యాప్తు పూర్తిచేయడం తదితర అంశాలను బట్టి ఉద్దేశ పూర్వకంగా సాక్షాధారాలు లేకుండా చేసేందుకు ఈ ఘాతకానికి పాల్పడినట్లు విధితమవుతుంది. జిల్లాలో 121మంది ఉపాధ్యాయులు నకి లీ మెడికల్ బిల్లులు సమర్పించి దాదాపు 1.50 కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 40మంది దాకా పదవీ విరమణ పొందారు. మిగతావారు సర్వీసులో ఉన్నారు. ఇందులో కొందరు రూ.1.80లక్షల చొప్పున మెడికల్ బిల్లులను రెండుసార్లు డ్రా చేయగా మరికొందరు ఒకసారి, ఇంకొందరు లక్ష రూపాయల లోపే బిల్లులు తీసుకున్న వారున్నారు. దీనిపై లోకాయుక్త సీరియస్ కావడంతో కేసు కొలిక్కి వచ్చే దశలో ఉంది. ఇంతలో జరిగిన ప్రమాదంలో రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
జిల్లాలో 63మంది ఉపాధ్యాయులు నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందగా.. వారిలో ఒకరు మరణించారు. మిగతా వారిపై విచారణ సాగుతోంది. గత సంవత్సరం 12మంది ఎంఈవోలపై సస్పెన్షన్ వేటు పడింది. అర్హతలేకున్నా రిటైర్డ్ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి లక్షల రూపాయలు బిల్లులు డ్రా చేశారనే కారణంతో వీరిని సస్పెండ్ చేశారు. బీసీ-బీ, మరోమారు బీసీ-ఇ సర్టిఫికెట్‌లు సమర్పించి డీఎస్సీ రాశారనే కారణంతో ఎనిమిదిమందిని సస్పెండ్ చేశారు. మరో 33మంది ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని ఫిర్యాదులున్నాయి. ఇవేకాకుండా సాక్షాత్తు డీఈవో సంతకాలు ఫోర్జరీ చేసి 11 ప్రైవేట్ స్కూళ్లకు గుర్తింపును రెన్యువల్ చేయడాన్ని డీఈఓ జగదీశ్ స్వయంగా పట్టుకొని పోలీసు కేసు నమోదు చేయించారు. అనంతరం సస్పెండ్ చేశారు.
మరికొందరు అధికారులను సరెండర్ చేశారు. డీఈఓ కార్యాలయంలో దీర్ఘకాలంగా ఒకే సెక్షన్‌లో పనిచేస్తున్న వారిని వేర్వేరు విభాగాలకు మార్చారు. దీంతో పలువురు ఉద్యోగులు కినుక వహిస్తున్నారు. వారు గతంలో చేసిన పొరపాట్లు వెలుగులోకి వస్తాయనే ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. వాస్తవాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. డీఈఓ ఫిర్యాదు చేయడంతో కార్యాలయ మాజీ సూపరింటెండెంట్ లక్ష్మీనరసింహులుపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
డీఈఓ కార్యాలయ ‘బి’ సెక్షన్ దగ్ధం
Published Thu, Nov 28 2013 4:04 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement