కోవెలకుంట్ల: విద్యా శాఖ అధికారులకు ముందుచూపు లేకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల సోమవారం 60 మంది విద్యార్థులు రోడ్డునపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలోని గాంధీనగర్ ప్రాంతానికి 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో మొదట ఏడేళ్లు కొట్టంలో
నిర్వహించారు. అనంతరం రామిరెడ్డి అనే వ్యక్తి తాత్కాలిక ప్రాతిపదికన అద్దె లేకుండా ఉచితంగా భవనాన్ని ఇవ్వడంతో ఆరు సంవత్సరాలుగా అందులో నిర్వహిస్తున్నారు.
ఒకటి నుంచి ఐదు తరగతులున్న ఈ పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాల కోసం కేటాయించిన 10 సెంట్ల స్థలం ఆక్రమణకు గురికావడంతో సొంత భవనం నిర్మాణాన్ని ప్రారంభించలేదు. చివరికి 2012లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని, ఆక్ర మణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో రెండు గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 9 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఏడాదిన్నర కిందట గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఇప్పటిదాకా ఒక గది నిర్మాణం మాత్రమే పూర్తయింది. తన భవనాన్ని ఖాళీ చేయాలని ఏడాది కిందట భవన యజమాని రామిరెడ్డి విద్యాశాఖ అధికారులను కోరారు. గదుల నిర్మాణం పూర్తి కావపోవడంతో ఈ ఏడాది కూడా అందులోనే తరగతులను నిర్వహిస్తున్నారు. పదేపదే చెప్పినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం రామిరెడ్డి వచ్చి, భవనాన్ని ఖాళీ చేయాలని పట్టుబట్టారు.
దీంతో చేసేదేమీ లేక విద్యార్థులను బయటికి పంపి, ఖాళీ చేశారు. తరగతులను ఎక్కడ నిర్వహించాలో తెలియక ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయలు సందిగ్ధంలో పడ్డారు. చివరికి పూర్తి అయిన ఒక గదిలోనే ఐదు తరగతులకు చెందిన 60 మంది విద్యార్థులను కూర్చొబెట్టారు. కాగా.. ఇప్పటిదాకా కాంట్రాక్టర్‌కు రూ.6.50 లక్షలు చెల్లించామని, నిర్మాణం పూర్తయిన తర్వాత మిగతా డబ్బు చెల్లిస్తామని సర్వశిక్ష అభయాన్ ఈఈ భాస్కర్ తెలిపారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించామన్నారు.
రోడ్డునపడ్డ విద్యార్థులు
Published Tue, Jul 22 2014 1:23 AM | Last Updated on Thu, May 24 2018 1:53 PM
Advertisement
Advertisement