బోసిపోయిన బెజవాడ
సంక్రాంతి పండుగ సందర్భంగా జనమంతా పల్లె బాట పట్టారు.దీంతో బెజవాడనగరం బోసిపోయింది.రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీతో కిక్కిరిసి ఉండే బెజవాడ నగరం శనివారం బోసిపోయింది. వాహనాల హడావిడి నామమాత్రంగా కనపడింది. జనం రోడ్లపై పెద్దగా కనిపించలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని ప్రజలు తమ స్వస్థలాలకు తరలి వె ళ్లారు. పండుగ సెలవులు కావటంతో విజయవాడ నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నగరంలో సుమారు 12 లక్షల జనాభా ఉండగా దాదాపు మూడు లక్షల మంది తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల నుంచి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం నగరానికి వలస వచ్చారు.
ఆయా ప్రాంతాల నుంచి జనం వ్యాపారంతో బతుకు తెరువు కోసం నగరంలో జీవనం సాగిస్తున్నారు. వారంతా నగరం విడిచి వెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావటంతో ఉద్యోగులు కూడా బంధుమిత్రుల ఇళ్లకు, తీర్థయాత్రలకు తరలి వెళ్లారు. ఈ క్రమంలో రోడ్లపై జనసంచారం తగ్గింది. దీంతో ఆటోలు, సిటీ బస్సుల సంఖ్య కూడా మూడు రెట్లు తగ్గింది. కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా అంతగా కనపడలేదు. దీనికి తోడు నగరంలో వీఐపీల తాకిడి కూడా కనిపించలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ సొంత ఊళ్లకు పరిమితమయ్యారు. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, వైన్‌షాపుల వద్ద మాత్రం కొద్దిపాటి సందడి నెలకొంది.
కోడిపందేలకు తరలి వె ళ్లిన జనం
నగరంలో కోడిపందేలు, జూదం లేకపోవటంతో విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు జనం పయనమయ్యారు. కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కోడిపందేలు, జూదం ఆడేందుకు, వీక్షించేందుకు వందలాది కార్లలో పలువురు తరలివెళ్లారు.