తిరుపతి(కార్పొరేషన్),న్యూస్‌లైన్: హైదరాబాద్‌కు రాకూడదని వితండవాదంతో సీమాంధ్రులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వేర్పాటువాదులను సాప్స్ తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళుతున్న సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణవాదుల దాడులను నిరసిస్తూ సాప్స్ నాయకులు శనివారం ఆందోళనకు దిగారు. తొలుత ర్యాలీగా తెలుగుతల్లి విగ్రహం వద్దకు చేరుకుని పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా శ్రీవికాస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు తెలుగుతల్లి విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
‘గుండె నొప్పికి మందులు వేసే మేము గుండెలేని నిన్ను మా ర్చురీకి పంపిస్తాం, అందరికీ ప్రాణాలుపోసే నర్సులం మేము మీకు మాత్రం ప్రాణాలు తీసే నర్సులం, కష్టాలు మాకు కాసులు మీకా, ఇటలీ సోనియా దేశం నుంచి వెళ్లిపోవాలి, నవభారతం రావాలి’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ వేర్పాటు వా దులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల విజయకుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వాహనాలను అడ్డుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
దాడులు చేసినా మా లక్ష్యం ఆగదు...
శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న సీమాంధ్రులపై కక్షతో దాడులు చేసినా సమైక్య ఉద్యమ లక్ష్యం మాత్రం ఆగదని డాక్టర్ సుధారాణి అన్నారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ త్యాగానికి, శాంతికి మారుపేరుగా సీమాంధ్రులు ఉద్యమం చేస్తుంటే తెలంగాణవాదులు వితండవాదంతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ పరిణామాలు వారి బుద్ధితక్కువ తనానికి నిదర్శనమని తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులపై జరుగుతున్న దాడులను గమనిస్తున్నామని, ఎంతరెచ్చగొట్టినా సమైక్య లక్ష్యం మాత్రం ఆగదన్నారు. తాము చేస్తున్న ఉద్యమం తెలంగాణవాదులకు వ్యతిరేకం కాదని,
రాష్ట్ర విభజనకు చిచ్చు పెట్టిన రాజకీయ వేర్పాటు వాదులపై మాత్రమేనని స్పష్టం చేశారు. సాప్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ సభకు వెళుతున్న సీమాంధ్రులపై దాడులకు పాల్పడడం అవివేకమన్నారు. వారు అడ్డుకున్నా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని బట్టి హైదరాబాద్‌లోనూ సమైక్యవాదం కోరుకునే వారు అధికంగా ఉన్నారన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ సంక్షోభం సృష్టిం చైనా సమైక్యాంధ్రను సాధించుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. సమైక్యవాదులు శ్రీనివాసచౌదరి, వివేక్, రెడ్డెయ్యరెడ్డి, జీవీ.కుమార్, శివశంకర్, ద్వారకనాథ్, హరి, దనంజయ, రాజు పాల్గొన్నారు.
దాడులు చేసినా మా లక్ష్యం ఆగదు...
Published Sun, Sep 8 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement