
అల్లిపురం/ పెదవాల్తేరు: జీవీఎంసీ 9వ వార్డు పాతవెంకోజిపాలెంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాతవెంకోజిపాలెం గొల్లవీధిలో ఒడిశాకు చెందిన బబ్లుసాహు తన కుటుంబంతో కలసి జీవిస్తున్నాడు. ఈయన బుల్లయ్య కాలేజీ వద్ద పానిపూరి వ్యాపారం చేస్తుంటాడు. సాయంత్రం వ్యాపారం నిమిత్తం అక్కడికి వెళ్లిపోయాడు. ఆయన భార్య, బాబుతో కలిసి ఇంట్లోనే ఉంది. రాత్రి 9.30 గంటల సమయంలో వంట చేసేందుకు ఆమె స్టవ్ వెలిగించింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆమె బాబును తీసుకుని బయటకు వచ్చేసింది.
చుట్టుపక్కల వారు స్పందించేలోపే మంటలు గదంతా వ్యాపించాయి. పెద్ద శబ్ధంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ సంఘటనలో సుమారు రూ.20 వేలు నగదు, ఐదు తులాల బంగారం, ఇతర సామగ్రి మొత్తం రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో మూడు సిలండర్లు ఉన్నాయని, వాటిలో రెండు ఖాళీవి కావడంతో ప్రమాదం తప్పిందని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. మాజీ డిప్యూటీ మేయర్ మల్ల అప్పలరాజు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద విషయాన్ని తహసీల్దార్‌కు వివరించారు.