కాలిపోతున్న దుకాణాలు
విజయనగరం టౌన్: ఒక్కసారిగా మంటలు చెలరేగాయి... ఇంతలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఎం జరిగిందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది... కేవలం గంటలోనే ఆ ప్రాంతమంతా బూడిదగా మారింది.. దుకాణాలు కాలిపోవడంతో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.. వివరాల్లోకి వెళితే.... పట్టణ నడిబొడ్డున ఉన్న గంటస్తంభం ప్రాంతంలో చిన్న మార్కెట్ నిత్యం కూరగాయల వ్యాపారంతో కిటకిటలాడుతుంటుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట నుంచి రెండు గంటల ప్రాంతంలో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మార్కెట్‌లో ఉన్న సుమారు 60 కుటుంబాలకు చెందిన 54 కూరగాయల షాపులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో కూరగాయలు, షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే పరిసర ప్రాంతంలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయి. కేవలం 20 నిమిషాల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 25 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే అగ్నిమాపక శాఖాధికారులు మాత్రం ఏడు లక్షల రూపాయల నష్టమే జరిగిందని అంచనా వేశారు. ప్రమాదం సంభవించిందని తెలియగానే జిల్లా అగ్నిమాపకశాఖాధికారి అవినాష్ జయసింహ, సహాయ అగ్నిమాపకాధికారి మాధవనాయుడు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
లబోదిబోమంటున్న బాధితులు
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పది గంటలకు ఇంటికెళ్లే వరకూ షాపుమీదే ఆధారపడి బతుకుతున్నాం. షాపులు కట్టేసి ఇంటికి వెళ్లినప్పుడు అంతా బాగానే ఉందని... సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగిపోయిందని బాధితులు లబోదిబోమంటున్నారు. కేవలం దుకాణాలమీదనే ఆధారపడి బతుకుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
బాధితులకు చేయూతనివ్వాలి
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలని మానవ హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అచ్చిరెడ్డి అన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలన్నారు. నష్టం జరిగిన వ్యాపారులకు ఒక్కో దుకాణానికి పర్మినెంట్ షెడ్‌లు నిర్మించి, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఆకతాయిలు అర్ధరాత్రి సమయంలో మార్కెట్‌లో మద్యం తాగుతూ హడావిడి చేస్తున్నారని.... ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పరామర్శలో ఆయనతో పాటు సంఘ ప్రతినిధులు సింహాద్రి, అమ్మాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి...
విజయనగరం మున్సిపాలిటీ: అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన చిన్నబజార్ ప్రాంతంలో పర్యటించిన కోలగట్ల ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక వ్యాపారి ఎంకేబీ శ్రీనివాసరావు బాధితుల కోసం రూ. 50 వేల చెక్కును కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కోలగట్ల మాట్లాడుతూ, బాధితులందరూ చిరు వ్యాపారులేనన్నారు. సుమారు 30 సంవత్సరాల కిందట ఇదే మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. బాధితుల వివరాలు పక్కాగా సేకరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరామర్శలో ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్ ఎస్‌వీవీ రాజేష్, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌషిక్, యువజన విభాగం అధ్యక్షుడు ఎస్. బంగారునాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొద్దాన అప్పారావు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మారం బాలబ్రహ్మరెడ్డి, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, పార్టీ నాయకులు కొబ్బరికాయల నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment