డెంకాడ : ప్రమాదంలో కాలిబూడిదైన ఇళల్లోని వస్తువులు, నగదు, దుస్తులు
విజయనగరం , డెంకాడ: అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.. ఇంతలో ఒక్కసారిగా పెద్ద మంటలు వ్యాపించాయి. దీంతో ఇళ్లల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే పది పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జొన్నాడ పంచాయతీ గొలగానిపేటలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గొలగాని సీతారాం ఇంటి నుంచి బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా వేడి గాలులు సోకడంతో భయంతో సీతారాం కుటుంబ సభ్యులందరూ బయటకు పరుగులు తీశారు. ఇంతలో వీధిలో ఉన్నవారందరూ బయటకు వచ్చి మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించారు.
అయితే మంటలు ఉద్ధృతంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న తొమ్మిదిళ్లు కూడా కాలి బూడిదయ్యాయి. గొలగాని అప్పలనాయుడు ఇంటిలో పెళ్లికోసం ఉంచిన రూ. ఐదు లక్షల నగదు కాలి బూడిదయ్యాయని బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ ప్రమాదంలో ఇళ్లల్లో ఉన్న వస్తువులు, ఆహార సామగ్రి కాలిపోయాయి. సుమారు 27 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరి గిందని అంచనా. అగ్ని కీలలు మొదటిగా గొలగాని సీతారాం ఇంటి వద్ద ప్రారంభమై పక్క ఇళ్లకు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న జొన్నాడ వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఎంపీటీసీ భర్త కోరాడ కోటినాయుడు బాధితులను పరామర్శించారు.
తహసీల్దార్ సందర్శన
గొలగానిపేటలో కాలిపోయిన ఇళ్లను తహసీల్దార్ సీహెచ్ లక్ష్మణప్రసాద్, వీఆర్వో మెరకయ్య పరిశీలించారు. తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి ఐదు వేల రూపాయలు, 20 కిలోల బియ్యం అందజేశారు.
నిమ్మలపాలెంలో...
కొత్తవలసరూరల్: కొత్తవలస మండలం నిమ్మలపాలెంలో రిట్టపల్లి అప్పన్నకు చెందిన జీడితోటలు కాలిపోయాయి. అరెకరా విస్తీర్ణంలోని జీడితోట కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 30 వేల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. కొత్తవలస అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment