సజీవ దహనమైన చింతమ్మ
విజయనగరం, గరివిడి: పూరిపాక కాలి వృద్ధురాలు సజీవ దహనమైన సంఘటన మండలంలోని కోనూరులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వట్టికాయల చింతమ్మకు (65) కొద్ది రోజుల కిందట ప్రమాదం జరగడంతో కాలు విరిగింది. అప్పటి నుంచి ఆమె మంచానికే పరిమితమైంది. ఆమెకు కుమారుడు తవుడు, కోడలు సునీత ఉన్నారు. అయితే ఆమె కాలకృత్యాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఆనుకుని ఉన్న వారి కళ్లాల్లో పూరిపాక వేసి అందులో ఉంచారు. ప్రతిరోజూ అక్కడికి వెళ్లి ఆమెకు సేవలు అందించేవారు. ఆదివారం ఉదయం కూడా కుమారుడు,కోడలు ఆమెకు సపర్యలు చేపట్టి పొలం పనులకు వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చింతమ్మ మంచం మీద నుంచి లేవలేకపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment