ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించండి
పాతగుంటూరు
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో అక్టోబర్ 2వ తేదీ నుంచి జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది,పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలపై ప్రజలలో సంపూర్ణ అవగాహన కలిపించాలని ఆయన సూచించారు. జన్మభూమి- మాఊరు కార్యక్రమంపై అక్టోబర్ 2వ తేదీన గ్రామాలలో ర్యాలీ, 4వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. అలాగే ఎంపీడీవో, తహశీల్దార్ నేతృత్వంలో మండలానికి రెండు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం ఒక గ్రామం, మధ్యాహ్నం ఒక గ్రామంలో ఈ బృందాలు పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలన్నారు. తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని వచ్చే నెల 2 తేదీ నుంచి 31 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో నిర్వహించాలన్నారు. కళా జాతాల ద్వారా ప్రతి ఇంటిని సందర్శించి పారిశుద్ధ్య కార్యక్రమం వారి గృహాల్లో అమలయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలలో తేదీల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జన్మభూమిలో కనీసం రెండు రోజులు జిల్లాలోని ఒకటి, రెండు గ్రామాలను ముఖ్యమంత్రి సందర్శించే అవకాశం ఉందని చెప్పారు. శంకుస్థాపన చేయవలసిన కార్యక్రమాలను గుర్తించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణాలలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన చేబ్రోలు, చిలక లూరిపేట, నరసరావుపేట, పెదనందిపాడు, సత్తెనపల్లి, వినుకొండ మండలాల అభివృద్ధి అధికారులను కలెక్టర్ అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర మండలాల అధికారులు లక్ష్యాలను ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రచార పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏజేసీ కె. నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు, డ్వామా పీడీ ఢిల్లీరావు, డీఆర్‌డీఏ పీడీ పి.ప్రశాంతి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ జి. వేణు, జిలా పంచాయతీ అధికారి గ్లోరి యా తదితరులు పాల్గొన్నారు.