సంస్థాన్ నారాయణపురం, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఔటర్‌రింగ్‌కు 25కిలోమీటర్ల దూరంలో ఉంది రాచకొండ. చారిత్రక సంపద ఇక్కడ ఉంది. రాజధాని చుట్టూ అభివృద్ధి జరుగుతున్నా రాచకొండ వైపు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఎన్నో ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వచ్చినా చివరకు చేతులెత్తేస్తున్నారు. ఇందుకు కారణం ఇక్కడ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తుండడమేనని తెలుస్తోంది. రాచకొండలో వేల ఎకరాల ప్రభుత్వ, ఫారెస్టు భూములున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆ భూములను నమ్ముకొని గిరిజ నులు బతుకుతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గిరి జనుల కోసం అటవీహక్కుల చట్టం తీసుకువచ్చి, మొట్టమొదటగా జిల్లాలోనే ఐదుదొనలతండాలో 48మందికి, రాచకొండ పరిధిలోని మిగతా తండాలలో 131 మందికి 433 ఎకరాలకు పట్టాలందించారు. మూడో విడత నుంచి ఆరో విడత వరకు రాచకొండలో అసైన్డ్ కమిటీ ద్వారా భూపంపిణీ జరగలేదు. రియల్‌ఎస్టేట్‌లో జరిగిన అక్రమాలను చూపిస్తూ పేద ప్రజలకు, భూమి లేని రైతులకు భూపంపిణీ చేయలేదు. ఏడో విడత అసైన్డ్ కమిటీ ద్వారానైనా భూపంపిణీ జరుగుతుందనుకుంటే ఇప్పటి వరకూ జరగలేదు. గత ఏడాది సీపీఐ నాయకులు భూములు పంపిణీ చేయాలని రాచకొండలో జెండాలు పాతారు. ఉన్న భూములను ఆక్రమించుకుని దున్నకాలు చేశారు. అయినా భూపంపిణీ జరగలేదు. ప్రాజెక్టులు రాకపోవడానికి, భూపంపిణీ జరగకపోవడానికి ఫీల్డ్ ఫైరింగ్‌రేంజ్, క్షిపణి ప్రయోగకేంద్రం ఏర్పాటేనని ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రెండు కేంద్రాల కోసమేనా?
క్షిపణి ప్రయోగ కేంద్రం, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భూ పంపిణీ చేస్తే.. క్షిపణి, ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు భూసేకరణ సమస్య ఎదురవుతుంది. అదే విధంగా ఐటీపార్కు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఫీల్డ్‌ఫైరింగ్ రేంజ్‌కు అవరోధంగా మారుతాయి. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినా, నెమళ్ల పార్క్ ఏర్పాటు చేసినా ఎప్పుడూ బాంబుల మోతతో దద్ధరిల్లే క్షిపణి ప్రయోగ కేంద్రం, ఫీల్డ్‌ఫైరింగ్ రేంజ్‌ల ఏర్పాటుకు అనుమతులు లభించవనే ముందస్తు ఆలోచనతో అభివృద్ధి చేయకుండా వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా స్థలం సమస్య తీవ్రమవుతుందన్న కారణమని తెలుస్తోంది.
ఉద్యమానికి సిద్ధమవుతున్న పార్టీలు..
క్షిపణి ప్రయోగ కేంద్రం, ఫీల్డ్‌ఫైరింగ్ రేంజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఫీల్డ్‌ైఫైరింగ్ రేంజ్ వ్యతిరేక ఉద్యమ మాజీ కన్వీనర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గులాం రసూల్ ఈ నెల 8న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కాగా రాచకొండ సర్పంచ్ కాట్రోతు సాగర్ శుక్రవారం సంస్థాన్ నారాయణపురంలో సమావేశం నిర్వహించి ఈ నెల 9న మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో అన్ని పార్టీలు ఏకతాటిపై పనిచేసి ఫీల్డ్‌ఫైరింగ్ రేంజ్ ఏర్పాటును ప్రభుత్వంతో విరమింపజేశాయి. ఇప్పడు కూడా అన్ని పార్టీలు ఏకమై ఉద్యమం నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
అభివృద్ధి బాటకు ఫైరింగ్ అడ్డు
Published Sun, Dec 8 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement