
ప్రొద్దుటూరు టౌన్ : మండల పరిధిలోని అమృతాగనర్‌లో ఉన్న పేదలకు సొంతిల్లు కట్టించాలని నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారని.. అయితే ఆయన అకాల మరణంతో కాలనీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్ ఎంవీ రమణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివా రం మండల పరిధిలోని అమృతాగనర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. పంచాయతీ నిధులతో కొన్ని పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. కాలనీలో అర్హులైన చాలామందికి పింఛన్లు రాలేదన్నారు. ఒక్క సంవత్సరం ఆగితే జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నా రు. అప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుం దామని తెలిపారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు.
ఎంవీఆర్‌తో జెండా ఆవిష్కరణ..
స్థానిక వైఎస్సార్ విగ్రహం ముందు వైఎస్సార్‌సీపీ జెండాను ఎంవీ రమణారెడ్డితో వైఎస్ జగన్ ఆవిష్కరింపజేశారు. అనంతరం స్థానిక మహిళలు జగన్‌కు సమస్యలు ఏకరువు పెట్టారు. అన్ని అర్హతలు ఉన్నా తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ ఒక్క ఏడాది ఆగితే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.