స్థానికత ఆధారంగానే ఉద్యోగులను పంచాలి
పెన్షనర్ల విభజనా అలాగే జరగాలి: దేవీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్ల విభజన జరగాలని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఏకపక్షంగా ఉద్యోగులను విభజిస్తే.. సమ్మెకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, మహిళా విభాగం చైర్మన్ రేచల్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు.
జనాభా దామాషా ప్రకారం ఉద్యోగులను కేటాయించినా, పింఛన్‌లను జనాభా ప్రాతిపదికన ఇచ్చినా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాన విభాగాల్లో నూటికి నూరుపాళ్లు పోస్టులన్నీ తెలంగాణ వారికే దక్కాలన్నారు. 70 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు ఓపెన్ కోటా కింద తెలంగాణలో పని చేస్తున్నారని... వారు ఆప్షన్ ఇచ్చిన వెంటనే వారిని పంపించివేయాలన్నారు. సీమాంధ్రలోని తెలంగాణవారిని వెనక్కి ఇవ్వాలని కోరారు. తెలంగాణలో 5 లక్షల 40 వేల ఉద్యోగాలకుగాను 3 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. ఖాళీలను తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి పూరించాలన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉద్యోగుల ఒక రోజు వేతనాన్ని అమరుల సహాయనిధికి అందజేస్తామన్నారు.