ఆనందోత్సవం
- ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి సర్వభూపాల వాహనాల్లో ఊరేగిన మలయప్ప
- వాహనసేవల్లో పెరిగిన భక్తుల సందడి, నిండిన గ్యాలరీలు
- సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాల హోరు
సాక్షి, తిరుమల: సోమవారం ఉదయం కల్పవృక్షం, రాత్రి సర్వ భూపాల వాహనాలపై స్వామివారు దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. ఉత్సవాలలో మొదటి మూడు రోజులు భక్తుల రద్దీ కొంత తక్కువగా కనిపించినా నాల్గోరోజు నుంచి కొంత పెరిగి సందడి పెరిగింది. ఉద యం కల్పవక్ష వాహనసేవలో భక్తులు అధిక సంఖ్యలో కనిపించారు. నాలుగు మాడ వీధు ల్లో వాహనసేవలు తిలకించేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కొన్ని చోట్ల ఖాళీగా, మరి కొన్ని చోట్ల నిండుగా కనిపించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవలో కూడా భక్తులు ఇదే స్థాయిలో కనిపించారు.
ఆలయం లోపల మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు తిరుమంజనం, వెలుపల సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ నాల్గవరోజు ప్రత్యేకత. టీటీడీ ఉద్యానవన శాఖ వేల టన్నుల పుష్పాలతో రూపొందించిన పుష్ప ప్రదర్శన శాలకు భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సోమవారం సుమారు 45 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అన్నదానం, క్యూలు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద సుమారు 58 వేల మందికిపైగా అన్న ప్రసాదం అందజేశారు.
కళాబృందాల ప్రదర్శనల హోరు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ భక్తులను కట్టిపడేస్తోంది. వాహనసేవల ముందు సంగీత, సాంస్కృతిక కళా బృం దాలు ప్రదర్శనలు అలరిస్తున్నాయి. కళాకారుల విభిన్న కళా ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చిన హిందూస్తానీ భజన బృందాలు డప్పువాయిద్యం భక్తులను ఉర్రూతులూగించాయి. టీటీడీ అధికారుల సైతం కళాకారులతో కలసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వీరికి కళాకారులు తోడై నృత్యం చేశారు.