
పొగాకు రైతులకూ రుణమాఫీ
వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి
ఒంగోలు టూటౌన్ : చిన్నసన్నకారు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల మాఫీపై ఇంత వరకు సర్కార్ స్పష్టత ఇవ్వకముందే రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పొగాకు రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టినా.. వాటిని తిరిగి రైతులకు చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం(దర్శి), నాబార్డు సంయుక్తంగా శుక్రవారం ఒంగోలులోని ఆచార్య ఎన్‌జీ రంగాభవన్‌లో శాస్త్రవేత్తలు, రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తెస్తామన్నారు.
గొర్రెల పెంపకం రైతులకు రాయితీలు ఇస్తామని చెప్పారు. కోల్డ్ స్టోరేజీల్లో ధాన్యం నిల్వ చేసుకున్న రైతులకు వడ్డీ లేని రుణాలను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి మండలంలో భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను దశలవారీగా అమలు చేస్తామన్నారు. సాగర్, గుండ్లకమ్మ ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం వ్యవసాయ శాఖ రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. ముందుగా రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, పర్చూరు, కొండపి శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, కరణం బలరాం, కలెక్టర్ విజయకుమార్ మాట్లాడారు.
ప్రాంతీయ పరిశోధన సంస్థ(గుంటూరు) అధికారి డాక్టర్ ఈ నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రిని ఘనంగా సన్మానించారు.
సమావేశంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్, డీసీసీబీ చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డి, ఉద్యానశాఖ ఉన్నతాధికారి విజయలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ జే మురళీకృష్ణ, ఉద్యానశాఖ ఏడీఏలు రవీంద్రబాబు, జెన్నమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ రజనీకుమారి, పట్టుపరిశ్రమ శాఖ అధికారి చిత్తరంజన్ శర్మ, నాబార్డు అధికారిణి జ్యోతి శ్రీనివాస్, మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్, ఏపీఎంఐపీ పీడీ మోహన్‌కుమార్, మత్స్యశాఖ ఏడీ రంగనాథ్, ప్రాంతీయ ఉద్యానశాఖ ట్రైనింగ్ ప్రిన్సిపాల్ రామారావు, ఏఎంసీ చైర్మన్ ఘనశ్యామ్, రైతు సంఘ నాయకులు దుగ్గినేని గోపీనాథ్, చుంచు శేషయ్య, చుండూరి రంగారావు, కేవీవీ ప్రసాద్, ఆత్మ పీడీ, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
ఆహార పదార్థాల ప్రదర్శన
సేంద్రియ ఎరువులతో పండించి, తయారు చేసిన ఆహార పదార్థాలు, విత్తనాలను సభ వేదిక వద్ద వ్యవసాయాధికారులు ప్రదర్శనగా ఉంచారు. రాగి ముద్దలు, అరిశలు, చెక్కలు, పలురకాల విత్తనాలు, రెడ్‌గ్రామ్, గ్రీన్‌గ్రామ్, నాణ్యమైన ఇతర కూరగాయలను ప్రదర్శనగా ఉంచారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందుబాటులో ఉంచారు.