
వినుకొండ: చంద్రబాబు తాను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఉంది.. తాను చెప్పిందే ప్రజలు వినాలన్న భ్రమలో ఆయన బతుకుతున్నారని, ఇలాంటి వారి వల్లే రాజకీయ నాయకులంటే ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని బొల్లా బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ లెవల్ కన్వీనర్ల మూడు రోజుల శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ధర్మాన ఆవిష్కరించారు. వేదికపై ఏర్పాటు చేసిన మహానేత రాజన్న విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజలు గుండెల మీద చెయ్యి వేసుకుని జీవించారని గుర్తు చేశారు. తేడా లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చేయగలిగిన గొప్ప వ్యక్తి వైఎస్ అని చెప్పారు.
చంద్రబాబు పాలనలో అనర్హులకే అందలం దక్కుతుందని, అర్హులు సంక్షేమ ఫలాలు అందక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎంత కష్టపడతారో అసెంబ్లీ సెగ్మెంట్‌లకు కూడా కష్టపడ్డప్పుడే సంపూర్ణ ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓట్లు సమర్థవంతంగా పోలింగ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లపై ఉందన్నారు. జిల్లాలో 3లక్షల ఓట్లు తొలగింపబడ్డాయని, జాబితాలో మార్పులు చేర్పులు గమనించి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రతి ఒటు కీలకమేని వివరించారు. రాష్ట్ర నేత వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు పాదయాత్ర చేస్తున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి, చీకట్లో రాత్రిపూట పాదయాత్ర చేసిన చంద్రబాబుకు తేడా ప్రజలు గుర్తించారన్నారు. ఎమ్మెల్యే జీవీకి దొంగ ఓట్లు వేయించడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గ్రామీణ, పట్టణంలో రెండు చోట్ల ఓట్లు వేయించిన ఘనుడు ఎమ్మెల్యే జీవీ అని అన్నారు.
పంచభూతాలను దోచుకుంటున్న టీడీపీ నేతలు
అధికార టీడీపీ నాయకులు పంచభూతాలను సైతం దోచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. అధికార తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తూనే మహారాష్ట్రలోని ఓ మంత్రి భార్యకు టీటీడీ బోర్డు మెంబరుగా నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలు రహస్య ఎజెండాతో స్నేహాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని కార్యకర్తలు గ్రామాలల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బోతున్నారని జోస్యం చెప్పారు. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు రానున్నరోజుల్లో మంచి గుర్తింపు లభిస్తుందని, ఇది తన మాట కాదని, జగన్‌మోహన్‌రెడ్డి చెప్పమన్న మాటని కార్యకర్తలకు తెలియజేశారు.
కార్యకర్తలు గ్రామస్థాయిలో టీడీపీ చేస్తున్న దోపిడీని గుర్తించి ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. బీజేపీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రహస్య పొత్తు కొనసాగుతోందని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైయితే ప్రత్యేక హోదా ఇచ్చి ప్రజలకు న్యాయం చేస్తారో వారితో కలసి పనిచేస్తామని బొత్స స్పష్టం చేశారు. త్వరలో మండల స్థాయి కమిటీ సభ్యులకు శిక్షణనిస్తామన్నారు. ప్రతి కార్యకర్తా బూత్ స్థాయిలో రెండు ఓట్లు వేయించగల్గితే అధికారం చేపట్టవచ్చని సూచించారు.
స్థానిక ఓటర్లపై దృష్టి పెట్టాలి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ట్లాడుతూ ప్రతి కార్యకర్తా స్థానిక ఓటర్లపై దృష్టి సారించాలన్నారు. బూత్ స్థాయి ఓటరు లిస్టుల్లో పేర్లున్న 1000 మందిలో 100 ఓట్లు స్థానికంగా నివాసం ఉండటం లేదని, వాటిని గుర్తించేందుకు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు.
సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి
పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియా సగానికి పైగా ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తోందన్నారు. పార్టీకి ఏ మీడియా సహకరించకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.
ప్రోటోకాల్ విస్మరించిన ప్రభుత్వం
సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలువకుండా అధికా దుర్వినియోగానికి ప్పాడిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. నాలుగేళ్లుగా పడుతున్న అవమానాలు, ఇబ్బందులు తొలగిపోవాలంటే పార్టీని గెలిపించడం ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రమంలోఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, వల్లభనేని బాలశౌరి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ , కావటి మనోహర్ నాయుడు, అరవింద్ తదితర నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఘనంగా సత్కరించారు.