
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను, అనంతరం వచ్చిన వంశధార వరదలతో నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించడంతోపాటు శాశ్వత పునరావాసం కల్పిం చాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని కోరారు. పార్టీకి చెందిన పలువురు నాయకులతో కలిసి మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ని ఆయన చాంబర్‌లో కలిశారు. బాధితుల పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, శాశ్వత పరిష్కారాలపై మాట్లాడారు. ఉద్దానం ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన సామాజిక వర్గాలైన అగ్నికుల క్షత్రియ, కండ్ర, జాలరి, కేవేటి, బెంతులు, సొండి, దమ్మలి, బెంతు ఒరియాలు, పొందరి, నగర కులాల వారు పూర్తిగా నిరాశ్రయులై దుర్భర జీవి తాన్ని గడుపుతున్నారని... వీరిని తక్షణమే ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సహకారం లేదు
జిల్లాను తుపాన్లు తరచూ తాకుతున్నాయని.. దీంతో భారీ నష్టం వాటిల్లుతున్నాప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. జిల్లాను సైక్లోన్ జోన్‌గా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేస్తే గానీ శాశ్వత పరిష్కారం లభించదన్నారు. సముద్రతీరం ఇసుకతో నిండి ఉంటుండడంతో ఏమాత్రం గాలి వీచినా విద్యుత్ స్తంభాలు పడిపోయి భారీగా నష్టం వాటిల్లుతోందని ధర్మాన అన్నారు. శాశ్వత పరిష్కారం దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతానికి భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిహారం అందజేయాలన్నారు.
ఉద్దానం ప్రాంతంలో ప్రధాన పంట కొబ్బరి అని.. తరతరాల నుంచి ఈ పంటపైనే ప్రజలు ఆధార పడి జీవిస్తున్నారన్నారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అయినా ఇంత వరకూ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందన్నారు. పడిపోయిన కొబ్బరిచెట్లను ప్రభుత్వమే తొలగించాలని, కొబ్బరి వ్యవసాయానికి సరిపడేటట్లు భూమిని చదును చేసి తుపాన్లను తట్టుకునే సామర్యం గల పొట్టిరకం, అధిక దిగుబడినిచ్చే తక్కువ కాలంలో పంట వచ్చే కొబ్బరిచెట్లు నాటి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
'వరి పంట నాశనం’
♦ తుపానుతో జిల్లాలో ప్రధాన పంట అయిన వరికి తీవ్ర నష్టం వాటిల్లిందని ధర్మాన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తుపానుతో రెండు లక్షల ఎకరాలు, అనంతరం వచ్చిన వరదలతో మరో లక్ష ఎకరాల్లో పంటలు మునిగిపోవడంతో, తరువాత తెగుళ్లు సోకి ఉన్న పంట పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు. అలాగే ఇన్‌పుట్ సబ్సిడీ ప్రతి రైతుకూ అందేటట్లు చేయాలన్నారు. గతంలో తీసుకున్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేసి మరలా వ్యవసాయం చేసుకునేందుకు కొత్త రుణాలు అందివ్వాలని కోరారు. డ్వాక్రా మహిళలకు కూడా తుపానుతో నష్టం వాట్లల్లిందని.. వారికి కూడా రుణాలు మాఫీ చేసి కొత్తగా రుణాలు అందించాలని, రానున్న నాలుగు సంవత్సరాల వరకూ ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.
రోడ్లను బాగుచేయాలి
తుపాను కారణంగా గ్రామీణ రోడ్లతోపాటు ప్రధాన మార్గాలు, డ్రైనేజీలు పూర్తిగా నాశనమైన నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రోడ్లను మరమ్మతుచేయించి ప్రజలకు అంబాటులోకి తేవాలని ప్రసా దరావు కోరారు. అలాగే తీరప్రాంతంలోని మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని.. వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. అలాగే వలలు, బోట్లు, ఐస్ బాక్స్‌లు సరఫరా చేయాలన్నారు.
వేలాది ఇళ్లు నేలమట్టం
తుపానుతో సుమారు 50 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయయని కలెక్టర్‌కు ధర్మాన వివరించారు. గడచిన నాలుగున్నరేళ్లలో పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని.. నష్టం భారీగా వాటిల్లిందన్నారు. బాధితులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. గతంలో వచ్చిన హుద్‌హుద్ తుపాను బాధితులతోపాటు.. తాజాగా వచ్చిన తిత్లీ తుపాను బాధితులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
గిరిజనులకు వాటిల్లిన నష్టాన్ని పూరించాలి: ఎమ్మెల్యే కళావతి
సీతంపేట ఐటీడీఏ పరిధిలోగల ఎస్టీలకు తుపానుతో భారీ నష్టం వాటిల్లిందని.. వారిని ఆదుకోని నష్టాన్ని పూరించాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కలెక్టర్ ధనంజయరెడ్డికి విజ్ఞప్తి చేవారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టా లేదన్న కారణంతో బాధితులుగా గుర్తించకపోవడం తగదన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ప్రభుత్వ నిబంధనల మేరకే పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు పంటలను నష్టపోయారు.
విద్య, వైద్య ఖర్చులను భరించాలి: పిరియా విజయ
♦ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పిరియా విజయ మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు వైద్యం, విద్యకు అయ్యే ఖర్చులను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే భరించాలని కలెక్టర్‌ను కోరారు. తుపాను బాధిత ప్రాంతాల్లో విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు మెస్ చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం భరించడంతోపాటు రానున్న నాలుగేళ్లకు దీనిని వర్తింపజేయాలని కలెక్టర్‌ను కోరారు.
దొంగలను తయారు చేసిన్ సర్కార్
♦ కలెక్టర్‌ని కలిసిన అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గడచిన నాలుగున్నరేళ్లలో ప్రజాధనం ఏవిధంగా వచ్చినా దోపిడీ చేసే దొంగలను సర్కార్ తయారు చేసిందని వ్యాఖ్యానించారు. తుపాను నష్టపరిహారం విషయంలో కూడా ఆ దొంగల స్వైరవిహారం చేసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ప్రజలు ఉండాలన్నారు. నష్టపరిహారం జాబితాలో అనర్హులను చేర్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులను జడిపించి, బెదిరించి వారిచే తప్పుడు రికార్డులు చేయించే పనిలో టీడీపీ నాయకులు ఉన్నారని వీటిని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు.
♦ కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కష్ణదాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్, నాయకులు అంబటి శ్రీనివాసరావు, మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, మార్పు ధర్మారావు, పీస శ్రీహరి, గొండు రఘురాం, టి కామేశ్వరి, డాక్టర్ పైడి మహేశ్వరరావు, ఎంవీ స్వరూప్, సాధు వైకుంఠం, పొన్నాడ రుషి, కోరాడ రమేష్, హనుమంతు కిరణ్‌కుమార్, మార్పు మన్మథరావు, ప.పద్మలోచనరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment