రాజధాని భూములకు పరిహారం ఇలా: చంద్రబాబు
ఏపీ రాజధాని భూసేకరణ ఫలితంగా భూములు కోల్పోయే మెట్ట, జరీబు రైతులకు వేర్వేరుగా పరిహారాలు ఇవ్వనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నాడు సైబరాబాద్ కోసం భూములు ఇచ్చినవాళ్లు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. రైతులు తనపై నమ్మకం ఉంచారని, ఆ నమ్మకాన్ని తాను కాపాడుకుంటానని చెప్పారు. రైతుల సంక్షేమ బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. కొత్త రాజధానిలో మొదటి లబ్ధిదారులు రైతులేనని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి చాలామంది రైతులు భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్నారు.
భూసేకరణను ఏదోలా విఫలం చేయాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేశారని, రాజధాని అంశాన్ని ఆలస్యం చేస్తే.. ఏదో ఒక లబ్ధి ఉంటుందని ఆలోచించారన్నారు. కానీ ఏ రైతూ దీనికి సిద్ధంగా లేరన్నారు. భూములను రెండు విభాగాలుగా వర్గీకరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. పట్టా ఉన్న మెట్ట భూములకు ఎకరం భూమికి గాను నివాసయోగ్యమైన వెయ్యి చదరపు అడుగుల భూమి కేటాయిస్తున్నామని, వాణిజ్యపరమైన మరో 200 చదరపు అడుగులు కూడా ఇస్తున్నామని వివరించారు. జరీబు భూముల్లో నివాసయోగ్యమైన వెయ్యి చదరపు అడుగులు, వాణిజ్య అవసరాల కోసం 300 చదరపు అడుగులు ఇస్తున్నామని తెలిపారు. జరీబు భూములంటే కృష్ణానదిని ఆనుకున్న భూములని ఆయన వివరణ ఇచ్చారు.