ప్రొద్దుటూరు: మిల్లర్ల నుంచి లెవీ బియ్యం సేకరణ విధానంలో కేం ద్ర ప్రభుత్వం చేసిన మార్పులు మిల్లర్లకు కష్టాలు తెచ్చారుు. దీంతో గత కొంత కాలంగా చాలావరకు రైస్ మిల్లులు నెలకు నాలుగైదు రోజులు కూడా నడవడం కష్టంగా మారిం ది. ఇలాగే కొనసాగితే జిల్లాలోని రైస్‌మిల్లులు చాలా వరకు మూతపడతాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు సంబంధించి సుమారుగా 70 రైస్‌మిల్లులు ఉండగా ఇందులో ఒక్క ప్రొద్దుటూరులోనే 30 వరకు ఉన్నారుు. మిల్లర్లు ఆడించిన బియ్యంలో 75 శాతం లెవీ, 25 శాతం మిల్లర్లు మార్కెట్‌లో అమ్ముకునేటట్లుగా నిబంధనలు విధించారు. చాలా కాలంగా ఇదే విధానం నడుస్తోంది.
అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిబంధనలను మార్పు చేసింది. కేవలం 25 శాతం మాత్రమే లెవీకి బియ్యం సరఫరా చేయాలని, మిగతా 75 శాతం మార్కెట్‌లో అమ్ముకోవాలని నిబంధనలు విధించింది. రైతులకు కనీసం మద్దతు ధరను కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాల్లో స్పష్టత లేదని మిల్లర్లు చెబుతున్నారు. వాస్తవానికి మార్కెట్ యార్డులకు వచ్చి రైతులు ధాన్యం అమ్మే పరిస్థితి జిల్లాలో లేదనేది వారి వాదన. ఇందుకు సంబంధించిన సదుపాయాలు కూడా మార్కెట్‌యార్డులో లేవు. మిల్లర్లు లెవీ ఇచ్చిన తర్వాత 2:1 నిష్పత్తిలో రెండు శాతం బియ్యాన్ని రాష్ట్రంలో, ఒక శాతం బియ్యాన్ని బయటి రాష్ట్రాల్లో అమ్ముకోవాలని నిబంధనలు విధించారు. అయితే లెవీకి బియ్యం పూర్తిగా ఇచ్చిన తర్వాతనా లేక ముందా అనే విషయంపై స్పష్టత లేదని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా చాలా రోజులుగా మిల్లులు మూతపడ్డాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరిధాన్యం ఉత్పత్తి అయినా మిల్లర్లు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఏది ఏమైనా ప్రభుత్వ విధానం వల్ల నష్టపోతున్నామని యజమానులు చెబుతున్నారు. తద్వారా కూలీలకు కూడా ఉపాధి కరవు అయింది. ఈ నిబంధనలలో మార్పు చేయాలని గతంలోనే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నేడు లెవీపై జేసీ సమావేశం
పౌరసరఫరాల శాఖ అధికారుల లెవీ సేకరణకు సంబంధించి 2014-15 ఖరీఫ్ సీజన్‌కు గాను మార్గదర్శకాలు జారీ చేశారు. మన జిల్లాకు సంబంధించి గత ఏడాది 21,645 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించగా ప్రస్తుతం నిబంధనలలో మార్పు వలన కేవలం 10,560 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు పౌరసరఫరాల కమిషనర్ బీ.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. లెవీ సేకరణకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కడప సభాభవనంలో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.
మిల్లర్లకు అవస్థలు తప్పడం లేదు
నూతన విధానం వల్ల మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఆరు నెలలుగా మిల్లులు సక్రమంగా నడవడం లేదు. కూలీలకు కూడా ఉపాధి కరువైంది. ఈ విధానం వలన రైతులు కూడా నష్టపోతారు.
ఎప్పుడు ఈ పరిస్థితి లేదు
గత 25 ఏళ్లుగా మిల్లులో పనిచేస్తున్నాను. అయితే చాలా రోజులుగా మిల్లు నడవక ఉపాధి కరవవుతోంది. మిల్లులోనే పగలు ఉండి అన్నం తింటూ అవసరాలకు మిల్లర్‌తో డబ్బులు తీసుకుని వెళుతున్నా.
లెవీ కష్టాలు
Published Fri, Dec 5 2014 3:35 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement