సర్వశిక్ష అభియాన్ కార్యాలయం
సాక్షి,కడప: పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత గురించి మనం వినే ఉంటాం. అలాగే ఉంది సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు కార్యాలయ దుస్థితి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల అభివృద్ధితో పాటు మౌలిక వసతులకు నిధులిచ్చే కార్యాలయ ఇది. అలాంటి కార్యాలయంలో కనీస మౌలిక వసతులు లేవు. సిబ్బందికి సరిపడా గదులు లేవు. ఫైల్స్, ఫర్నిచర్‌కు అదనపు గదుల సౌకర్యం లేదు. దీంతో విలువైన ఫైల్స్‌ను కూడా బీరువాలపైన ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకుంది. పాఠశాలకు ఏవైన పుస్తకాలు వచ్చినా వాటిని కూడా భద్రపరిచేందుకు గదులు లేకపోవడంతో వాటిని కూడా వరండాల్లో ఉంచుతున్నారు. దీంతో విలువైన పుస్తకాలు కూడా పాడైపోతున్నాయి.
ఆరుబయట కుప్పలుగా పోసిన పుస్తకాలు
ఇందంతా ఒక ఎత్తు అయితే పాఠశాలల సమస్యలు, అభివృద్ధిపై ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, స్పెషల్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించాలంటే నగరంలోని ఎమ్మార్సీ దగ్గరకో లేక స్కూల్స్ దగ్గరకో పరిగెత్తి సమీక్షలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకుంది. ఇన్ని సమస్యలున్నా కనీసం కార్యాలయ సిబ్బంది ప్రశాంతంగా కూర్చొని విధులను నిర్వహించుకుందా మంటే అది కూడా కుదరని పరిస్థితి. కారణం కూర్చునే కుర్చీకి అటు పక్క ఇటు పక్క ఫైల్సే. సమస్యపై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అదనపు గదులను నిర్మాణానికి అనుమతులిచ్చి ఇరుకిరుకు గదులలో విధుల నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment