ప్రాజెక్టులను పరిశీలించిన మంత్రి దేవినేని ఉమ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు రైతుల కష్టాలను తీరుస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఆయన గురువారం ఉదయం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కేసీ కెనాల్ వెంట మంత్రి పర్యటించారు.
జూపాడుబంగ్లా సమీపంలోని కేసీ కెనాల్‌ను మంత్రి పరిశీలించి ప్రస్తుతం కేసీ కెనాల్‌కు విడుదలవుతున్న నీరు, చేపడుతున్న పనుల వివరాలపై అధికారులను ప్రశ్నించారు. నీటి పారుదల శాఖ సీఈ జీ చిట్టిబాబు మ్యాప్ ద్వారా మంత్రి కోరిన వివరాలను తెలిపారు. అనంతరం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్దకు చేరుకున్న మంత్రి అక్కడి రైతులతో కూడా మాట్లాడారు. వర్షపు నీరు వృధాగా సముద్రంలో కలిసి పోకుండా 44 వేల క్యూసెక్కుల శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పోతిరెడ్డిపాడు ద్వారా కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, అవుకు, గోరుకల్లు తదితర రిజర్వాయర్లకు మళ్లించి నీటిని సద్వినియోగం చేసుకుంటామన్నారు. అందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఎస్‌ఆర్‌బీసీ కెనాల్ వెడల్పు పనుల వేగం పెంచాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజక్టులపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. అనంతరం బానకచెర్ల రిజర్వాయర్ వద్దకు చేరుకున్న మంత్రి బానకచెర్ల నుంచి మూడు వైపులా వెళ్తున్న తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్ నీటి పారుదలతో పాటు అలగనూరు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల సామర్థ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఆదేశించారు.
ఎస్‌ఆర్‌బీసీ కుడి కెనాల్ వెడల్పు పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను కూడా ఆయన పరిశీలించారు. మంత్రి పర్యటనలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, నీటి పారుదల శాఖ సీఈ జి చిట్టిబాబు, ఎస్‌ఈ కే శ్రీనివాసరావు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సీఈ జలంధర్, ఎస్‌ఈ శ్యాంసుందరం, తెలుగుగంగ ఎస్‌ఈ సన్యాసినాయుడు, ఈఈలు విశ్వనాథం, రెడ్డి శేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులు, డీఈఈలు రమేష్‌బాబు, లక్ష్మణకుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల కష్టాలు తీరుస్తాం
Published Fri, Mar 6 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM
Advertisement