
'ఓటుకు కోట్లు కేసుపై పిల్ వేస్తాం'
హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే కొనుగోలుకు పాల్పడలేదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడా చెప్పడంలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు పై టీపీసీసీ, ఏపీసీసీలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)వేస్తాయని తెలిపారు. ఆర్థిక కుంభకోణంలో ఇరుక్కున్న లలిత్ మోడీని కాపాడేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సుష్మాస్వరాజ్, వసుంధర రాజే, స్మృతి ఇరానీ, పంకజ్ ముండేల వ్యవహారంపై మోదీ స్పందించాలన్నారు. విభజన చట్టంలో ఉన్న సెక్షన్-8 పై ఎవరికి అనుకూలంగా వారు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. సెక్షన్-8 అమలుకు సంబంధించి న్యాయ వ్యవస్థ స్పష్టత ఇవ్వాలన్నారు.