ఆ ఆస్తులతో నాకు సంబంధంలేదు: డిజిపి దినేశ్ రెడ్డి
హైదరాబాద్: సుప్రీం కోర్టు పిటీషన్‌లో పేర్కొన్న ఆస్తులతో తనకు ఎలాంటి సంబంధంలేదని డీజీపీ దినేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ కేసుపై వివరణ ఇచ్చారు. పిటిషన్‌లో పేర్కొన్నట్లుగా 1500 ఎకరాలతో తనకు సంబంధంలేదని చెప్పారు. 542 సేల్స్ డీడ్స్‌లో కేవలం ఏడున్నర ఎకరాలకు సంబంధించి మాత్రమే తనవిగా వివరించారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలూ బయటపడతాయని చెప్పారు. ఎంపీ సంతకాన్నిఫోర్జరీచేసి మళ్లీ తనపై ఫిర్యాదు చేశారన్నారు.
1977 బ్యాచ్కు చెందిన డిజిపి దినేశ్ రెడ్డితో సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వై.రవిప్రసాద్, ఏ.కృష్ణారెడ్డి జరిపిన అన్ని లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలని ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఉమేష్ కుమార్ పిటిషన్లోని అభియోగాలను దినేష్ రెడ్డికి ఎదుర్కోవల్సిందేనని స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలను ట్రయిల్ కోర్టులో తేల్చుకోవాలని డీజీపీకి సుప్రీంకోర్టు సూచించింది. దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా విచారణ దశ నివేదికను సమర్పించాల్సిందిగా జస్టిస్ బి.ఎస్. చౌహాన్, ఎస్.ఎ. బొబ్దెతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దినేశ్ రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించింది. అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రాథమిక విచారణ నివేదికను నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు నిన్న తెలిపాయి. దర్యాప్తులో భాగంగా దినేశ్ రెడ్డిని కూడా సిబిఐ విచారించనుంది.
డీజీపీ దినేశ్ రెడ్డి భార్యకు రంగారెడ్డి జిల్లా చంపాపేట, మహేశ్వరం, మేడ్చల్ లలో 90కి పైగా భూముల లావాదేవీలు అమ్మటం, కొనటం జరిగిందని ఉమేష్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా దినేష్‌రెడ్డి తన భార్య పేరుతో బెనామీగా ఆస్తులను కూడబెట్టారంటూ ఉమేశ్ కుమార్, అలాగే షూ కుంభకోణంలో ఉమేశ్ కుమార్ నిందితుడిగా ఉన్నారంటూ దినేష్‌రెడ్డి పరస్పర ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.