నా కథలు.. భావోద్వేగాలు.. అనురాగబంధాలు.. | director srikanth addala interview | Sakshi
Sakshi News home page

నా కథలు.. భావోద్వేగాలు.. అనురాగబంధాలు..

Published Mon, Jun 23 2014 2:45 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

నా కథలు.. భావోద్వేగాలు.. అనురాగబంధాలు.. - Sakshi

నా కథలు.. భావోద్వేగాలు.. అనురాగబంధాలు..

ప్రేమ, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ‘గొల్లభామ’నా తొలి రెండు చిత్రాలు కుటుంబ కథా చిత్రాలు. మూడో చిత్రం కూడా అదే అయితే నాపై కుటుంబ చిత్రాల దర్శకుడిగా ముద్ర పడిపోతుంది. అందుకే మూడో చిత్రానికి కథను ప్రేమ, యాక్షన్‌తో రూపాందించాను. దీనికి కొత్త హీరో అయితే బాగుంటుందని భావిస్తున్న క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ గుర్తుకు వచ్చాడు. నాగబాబు కూడా తన కుమారుడిని హీరో చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ‘గొల్లభామ’ కథ నాగబాబుకు వినిపించాను. నాపై నమ్మకంతో కథ విన్న వెంటనే ఆయన ఒప్పుకున్నారు.- దర్శకుడుశ్రీకాంత్ అడ్డాల
 
 అమలాపురం టౌన్ :మనుషుల మధ్య అల్లుకుపోయే అనురాగ బంధాలు... భావోద్వేగాలు... మానసిక సంఘర్షణలు... సున్నిత మనస్తత్వాలతో ముడిపడిన మానవ అంశాలే తన చిత్రాలకు కథా వస్తువులని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. ఇప్పటివరకూ నేను తీసిన కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల కథలు అలానే పుట్టుకు వచ్చాయని చెప్పారు. అందుకే ‘ఆకర్షణ తప్పు కాదు’ అనే కథాంశంతో కొత్త బంగారు లోకం చిత్రాన్ని..
 
 ‘మనిషి అంటేనే మంచోడు’ అనే కథా వస్తువుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని తీశానన్నారు. మూడో చిత్రంగా రూపు దిద్దుకుంటున్న ‘గొల్లభామ’ కథ కూడా ఈ తరహాలో అల్లుకున్నదేనని వివరించారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా లియో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణం నాలుగు  రోజులుగా అమలాపురంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకత్వంలో బిజీగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల ఆదివారం ఉదయం కొద్దిసేపు ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
 
 మాది ప.గో. జిల్లా
 నా సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి గ్రామం. మాది సామాన్య కుటుంబం. నాన్న విశ్రాంత దేవాదాయ శాఖ అధికారి. అమ్మ గృహిణి. అన్నయ్య, చెల్లి ఉన్నారు. భార్య, ఒక కుమార్తె.. ఇదీ నా కుటుంబం.
 
 సైంటిస్ట్ కావాలనుకుని..
 చిన్నప్పటి నుంచీ నేను మెరిట్ స్టూడెంట్‌ని. ఆంధ్రా యూనివర్శిటీలో ఎంటెక్ చేశా. ఢిల్లీ ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తూ మధ్యలో ఆపేసి సినిమా లోకంలోకి వచ్చా. మొదటినుంచీ సైంటిస్ట్ కావాలన్న లక్ష్యం ఉండేది. గోదావరి జిల్లాల యువకులకు లక్ష్యాల నిర్దేశంలో నిలకడ లేక.. భిన్న లక్ష్యాలపై దృష్టి పెట్టడంవల్ల అనుకున్న గోల్ చేరలేకపోతున్నారు. నా విషయంలోనూ అదే జరిగింది. ‘మనం లక్ష్యాలు, గమ్యాలు పదేపదే మార్చుకున్నా ఫర్వాలేదు. ఏ లక్ష్య సాధనలోనైనా పోరాటం తప్ప దు’ అన్న ఓ సూక్తి నాపై తీవ్ర ప్రభావం చూపింది.
 
 మా ఊరి నాటకాలే ప్రేరణగా..
 చిన్నతనంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మా ఊళ్లో వీధి నాటకాల్లో నటించేవాడిని. అక్కడే డిగ్రీ చదువుతున్నప్పుడు సాంఘిక నాటకా ల్లో పలు పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాను. ఆ ప్రశంసలే నన్ను సినిమాల వైపు అడుగులు వేయించాయి. అయితే ఇక్కడ సీన్ రివర్సయింది. తెర ముందు నటించే పని కాకుండా తెర వెనక పనిచేసే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాను.
 
 కథ, కథనం, దర్శకత్వం నేనే..
 నా సినిమాలకు కథ నేనే రాసుకుంటాను. దానికి కథనం కూడా రూపొందించుకుంటాను. నేనే దర్శకత్వం చేస్తాను. ఇప్పటివరకూ తీసిన రెండు చిత్రా లు ఈ పంథాలోనే సాగాయి. గొల్లభామ కూడా అంతే.
 
 ఇదీ ‘కొత్త బంగారులోకం’ నేపథ్యం..
 2003 సంవత్సరానికి ముందు నుంచి సినీ పరిశ్రమలోకి వెళ్లాలన్న కోరిక మరీ బలపడింది. దర్శకుడిగా టీనేజ్ కథా వస్తువుతో ఓ చిత్రానికి కథ రాసి, దర్శకత్వం వహించాలన్న లక్ష్యం పెట్టుకున్నా. పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను ప్రేమతో, భయంతో పెంచు తున్న తల్లిదండ్రుల భావాలు.. ఆకర్షణలో చేసే పనిని ఆలోచించి చేయాలని, తప్పు చేస్తే తనతో చె ప్పి చేయాలనే అంశాలు ఆధారంగా పిల్లలను అర్థం చేసుకునే నాన్న పాత్ర ద్వారా ‘కొత్త బంగారులోకం’ తీశా. తొలి చిత్రంతోనే హిట్ కొట్టా.
 
 ‘సీతమ్మ’ కథకు తిరుపతిలో శ్రీకారం
 తొలి చిత్రం విజయంతో రెండో చిత్రంవైపు ఉత్సాహంగా అడుగులు వేశా. ఈసారి కుటుంబ బంధాలకు సంబంధించి ఓ వినూత్న కథ రాయాలనుకున్నాను. తిరుపతి వెంకన్న అంటే అమితమైన ఇష్టం. ఆయన సన్నిధికి వెళితే రెండు రోజులు కొండపైనే ఉండి, ప్రశాంతంగా గడుపుతాను. అక్కడకు వస్తున్న కోట్లాదిమంది భక్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కో మనస్తత్వం ఉంటుంది. కానీ ఆ సన్నిధిలో అందరూ చేతులెత్తి స్వామిని చూసి తన్మయత్వం చెందుతున్న దృశ్యాలను చూశాను. మనిషిలో మంచితనం ఉంటుంది.
 
 దీనినుంచే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కథకు ప్రేరణ దొరికింది. ‘మనిషి అంటే మంచోడు’ అనే మాటతో కథ అల్లాను. ఇద్దరు అన్నదమ్ముల పాత్రలు సృష్టించి ఇద్దరికీ చెరో మనస్తత్వ కోణాలు చూపించి కథ రాశాను. ఈ కథ మల్టీస్టార్‌‌సతో అయితే బాగుంటుందన్న ఆలోచనను నిర్మాత దిల్‌రాజు ముందు ఉంచాను. ఆయన సై అన్నారు. అడిగిందే తడవుగా హీరో వెంకటేష్ తొలుత రెడీ చెప్పారు. తర్వాత మహేష్‌బాబు కథ విని ఓకే అన్నారు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement