మనసున మనసై.. బతుకున బతుకై..
ఇతడి పేరు మూడ్ బాలరాజు. పద్నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి నుంచి లారీలో వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. 8నెలల గర్భిణిగా ఉన్న భార్య, మూడేళ్ల కుమారుడు అక్కడికక్కడే మరణించగా.. ఇతడి రెండు కాళ్లూ తీసేయాల్సి వచ్చింది. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నారు. వారిపైనే ఆధారపడాల్సి రావడం అతడిని బాధిం చింది. ఎలాగైనా కష్టపడి పనిచేయాలనుకున్నాడు. తనకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన మేనకోడలు సంపూర్ణమ్మను వివాహం చేసుకున్నాడు. ఆమె సాయంతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని జీవిత పయనంలో ముందుకు వెళుతున్నాడు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంకు చెందిన బాలరాజు విజయగాథ అతడి మాటల్లోనే...
జంగారెడ్డిగూడెం : ‘మాది చింతలేని చిన్న కుటుంబం. అమ్మానాన్న.. భార్య.. మూడేళ్ల కొడుకు. నెల రోజుల్లో మరో బిడ్డ భూమిపైకి రాబోతోంది. కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. అంతా కలసి ప్లాస్టిక్ పువ్వులు, పంగల కర్రలు తయారు చేసి సంతల్లో అమ్ముకుంటూ బతికేవాళ్లం. 2000వ సంవత్సరంలో ఓ కుదుపు మా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది. ప్లాస్టిక్ పువ్వులు, పంగల కర్రలు తయారీఇక అవసరమైన ముడిసరుకు తెచ్చుకునేందుకు 8 నెలల గర్భిణిగా ఉన్న నా భార్య శ్రీదేవి (25), మా మూడేళ్ల కుమారుడు అజయ్‌బాబుతో కలసి తిరుపతి వెళ్లాం. సరుకులు కొనుక్కుని లారీలో ఇంటికి బయలుదేరాం. గుంటూరు సమీపంలో ఆ లారీ చెట్టును ఢీకొట్టింది.
నా భార్య శ్రీదేవి, కొడుకు అజయ్‌బాబు అక్కడికక్కడే చనిపోయారు. అపస్మారక స్ధితిలో ఉన్న నన్ను అక్కడి వారు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. నా రెండు కాళ్లు తొలగిస్తేనే తప్ప బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. విషయం తెలిసి మా బంధువులంతా వచ్చారు. రూ.3 లక్షలు ఖర్చు చేసి నన్ను బతికించారు. రెండు నెలలపాటు ఆసుపత్రిలో మంచానికే అతుక్కుని ఉండిపోయిన నేను ఎట్టకేలకు కోలుకున్నాను. వృద్ధులైన తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వచ్చినందుకు బాధపడ్డాను. ఏవిధంగానైనా కష్టపడి పనిచేసి వాళ్లకు ఆసరాగా నిలబడాలనుకున్నాను. మా అక్కా, బావ చనిపోవడంతో మా మేనకోడలు సంపూర్ణమ్మను మేమే పెంచాం.
నా దుస్థితిని చూసిన ఆమె నన్ను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చింది. పెళ్లయ్యాక నా తల్లిదండ్రులతోపాటు ఆమె కూడా మా కుటుంబం కోసం కష్టపడుతూ వచ్చింది. ఆ పరిస్థితుల్ని చూసి తట్టుకోలేకపోయాను. వారందరినీ నేనే పోషించాలనే దృఢ నిశ్చయానికి వచ్చాను. అశ్వారావుపేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.10 వేలు, తెలిసిన వారివద్ద మరికొంత సొమ్ము అప్పు చేశాను. మూడు చక్రాల మోపెడ్ కొన్నాను. దానిని నడపడం నేర్చుకున్నాను. తిరిగి వ్యాపారం మొదలుపెట్టాను. రాత్రీ పగలనక ప్లాస్టిక్ పువ్వులు, పంగల కర్రలు తయారు చూసి ఊరూరా తిరుగుతూ అమ్ముతున్నాను.
ఖర్చులు పోను రోజుకు కనీసం రూ.200 సంపాదిస్తున్నాను. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. రేషన్ కార్డు, ఉండటానికి ఇల్లు, వికలాంగ పింఛను ఇప్పిస్తే మా కుటుంబానికి ఎంతో మేలు కలుగుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నాకు ప్రతినెలా పింఛను అందేది. మూడు నెలలుగా ఇవ్వటం లేదు. చివరగా మీకో మాట చెప్పాలి. నా కృషి, పట్టుదల, విజయం.. ఇలా ప్రతి విషయంలోనూ నా భార్య సంపూర్ణమ్మ సహకారం ఎంతో ఉంది. ఆమెకు మాటల్లో కృతజ్ఞతలు చెబితే సరిపోదు. ఆమె రుణం తీర్చుకోలేనిది.’