
బ్యాంకు ఖాతాలో సొమ్ము మాయం
♦ కార్డు పునరుద్ధరణ పేరుతో దగా
♦ రూ.50వేలతో ఆన్‌లైన్ షాపింగ్
♦ లబోదిబోమంటున్న బాధితుడు
తిరువూరు : ‘మీ బ్యాంకు ఏటీఎం కార్డు కాలం చెల్లిపోయింది, పునరుద్ధరణకు కార్డు నంబరు, పిన్ నంబరు చెప్పండ’ని వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన ఓ ఉపాధ్యాయుడు రూ.50వేలు కోల్పోయిన ఉదంతం తిరువూరులో మంగళవారం వెలుగుచూసింది. మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోనారావు భార్య శాంతి పేరుతో తిరువూరు ఆంధ్రాబ్యాంకు శాఖలో ఖాతా ఉండగా, మూడు రోజులుగా ఆ ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డును పునరుద్ధరించుకోవాలని ఫోన్‌కాల్స్ వస్తున్నాయి.
హిందీలో వస్తున్న ఫోన్‌కాల్స్ అర్థంకాకపోయినా తమ ఏటీఎం కార్డు గడువు తీరిందని నమ్మిన ఉపాధ్యాయుడు సోమవారం కార్డునంబరు, పిన్‌నంబరును ఆగంతకుడికి తెలియజేశారు. అనంతరం ఏటీఎంకు వెళ్లి నగదు బ్యాలెన్సు పరిశీలించగా రూ.50వేలు డ్రాచేసినట్లు గుర్తించారు. రూ.2వేల చొప్పున 25సార్లు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా సొమ్ము డ్రా చేసినట్లు గమనించి కోనారావు దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఖాతాలోని సొమ్ము అపహరణకు గురైనట్లు గుర్తించి బ్యాంకు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం దినపత్రికల్లో ఇలాంటి సంఘటనలపై వార్తలు వెలువడుతున్నా... తాము కూడా మోసపోయామని వాపోతున్నారు.
అవసరం తీరాక
కోనారావు బ్యాంకు ఏటీఎం కార్డు పునరుద్ధరణకు వివరాలు కావాలని పదే పదే ఫోన్‌కాల్స్ చేసిన ఆగంతకుడు తన అవసరం తీరిన తర్వాత ఫోన్ నంబరును నిలిపివేశాడు. సోమవారం ఒక్కరోజే సుమారు 50సార్లు కాల్స్‌చేసి, ఖాతాదారును కంగారుపెట్టిన ఆగంతకుడు హుటాహుటిన నగదు డ్రా చేసుకున్నాడు. తమకు కాల్స్ వచ్చిన నంబరుకు డయల్ చేయడానికి ప్రయత్నించిన కోనారావుకు ఆ నంబరు మనుగడలో లేదని సమాధానం రావడంతో హతాశులయ్యారు. బ్యాంకునుంచి నగదు విత్‌డ్రా చేసినపుడు ఫోన్‌కు అలర్ట్ వచ్చే సదుపాయం ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు ఆ సదుపాయం వినియోగించుకోపోవడంతో జరిగిన మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు.