
మహిళా పోలీస్ మిత్రలతో మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, గుంటూరు: “దిశ పోలీస్ స్టేషన్‌ల ఏర్పాటు ఓ చరిత్ర.. మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరు పోలీస్ స్టేషన్‌లను ఇప్పటికే ప్రారంభించాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిగిలిన 12 స్టేషన్‌లను ప్రారంభించాం’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన అర్బన్ దిశ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం పోలీస్ శాఖ చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. మహిళల భద్రత కోసం దిశ ఎస్‌ఓఎస్ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చిన 2020 సంవత్సరం “ఉమెన్ సేఫ్టీ’ సంవత్సరంగా నిలుస్తుందన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని చెప్పారు. దిశ చట్టం అమలులోకి వస్తే దిశ పోలీస్ స్టేషన్‌లు మరింత బలోపేతం అవుతాయన్నారు. దిశ పోలీస్ స్టేషన్లలో మహిళా డీఎస్పీలను నియమించాలనుకున్నామని, అయితే సరిపడా మహిళా అధికారులు అందుబాటులో లేరన్నారు. రాబోయే రోజుల్లో సమస్యను అధిగమించి మహిళా అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించేలా దిశ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ–దిశ ఎస్‌ఓఎస్ యాప్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.
పోలీసు గౌరవ వందనం స్వీకరణ
దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డీజీపీ ముందుగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఆర్‌ఎస్‌ఐ బాషాను అభినందించారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. దిశ పోలీస్ స్టేషన్‌లో పోలీసు ఉన్నతాధికారుల విజిటర్స్ బుక్‌లో డీజీపీ తొలి సంతకం చేశారు. అనంతరం మహిళా పోలీసులతో, మహిళా మిత్ర వలంటీర్లతో మాట్లాడారు. కౌన్సిలింగ్ హాల్‌లో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఐజీ జె. ప్రభాకర్‌రావు, డీఐజీ అర్బన్ ఇన్‌చార్జి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, విజిలెన్స్ ఎస్పీ జాషువా, ఏఎస్పీలు గంగాధరం, ఈశ్వరరావు, మనోహర్‌లు, డీఎస్పీలు బి.సీతారామయ్య, బీవీ రామారావు, సుప్రజ, సౌజన్య, బాలసుంధర్‌రావు, రమణకుమార్, ప్రకాశ్‌బాబు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. దిశ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన ఐటీసీ సీఈవో సంజయ్ రంగరస్, డైరెక్టర్ వీరస్వామిను డీజీపీ ప్రత్యేకంగా అభినందిచి, కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు అర్బన్ కమిషనరేట్ ప్రతిపాదన పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హోం మంత్రి సుచరితతో చర్చించామన్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సన్నద్ధమై ఉందని డీజీపీ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించామన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత పోలింగ్ నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించామని, ప్రతిరోజూ ఎన్నికల నిర్వహణ, బందోబస్తు తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment