వారంలో నిర్వాసితులకు ప్యాకేజీల చెల్లింపు
పాతగుంటూరు: వారం రోజుల్లో పులిచింతల నిర్వాసితులకు చెల్లించాల్సిన ప్యాకేజీలను పూర్తిచేస్తామని పులిచింతల ప్రాజెక్టు యూనిట్-2 స్పెషల్ కలెక్టర్ వేణుగోపాల్ చెప్పారు. స్థానిక నగరంపాలెంలోని పులిచింతల ప్రాజెక్టు యూనిట్-2 కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ బోదనం, కేతవరం, పులిచింతల, కామేపల్లి మొదటి ఫేజ్‌లో ముంపునకు గురికానున్నాయని తెలిపారు. ఈ గ్రామాల్లో 1932 మందికి ప్యాకేజీ కింద రూ. 60 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇప్పటికే 595 మందికి రూ.20 కోట్లు చెల్లించారని, ఇంకా 1337 మందికి రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అందులో వందమందికి ఆన్‌లైన్ ప్రక్రియ జరుగుతోందని, 1240 మందికి ప్యాకేజీలు వారం రోజుల్లో ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. నిర్వాసిత కుటుంబాల్లో 2012 డిసెంబర్ 30 నాటికి 18 సంవత్సరాలు నిండినవారికి అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెం పునరావాసకేంద్రంలో ప్లాట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. యూనిట్-1 పరిధిలో కోళ్ళూరు, గొల్లపేట, చిట్యాల, చిట్యాల తండా ఫస్ట్ ఫేజ్ ముంపుగ్రామాల జాబితాలో ఉన్నాయి. 2,309 మందిలో 1,075 మందికి ప్యాకేజీలు అందజేశామన్నారు. 804 మందికి ఆన్‌లైన్ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ప్రాజెక్టులో 11 కేఎంసీల నీటిని నిల్వ చేస్తే ఎనిమిది గ్రామాలు పూర్తిగా మునిగే అవకాశం ఉందని చెప్పారు. ఎమ్మాజిగూడెం గ్రామంలో 128 గృహాలకు అంచనాలు వేసి గజిట్ పబ్లికేషన్ కూడా పూర్తయిందని, ఈ గృహాలకు రూ. 1.74 కోట్లు చెల్లించాల్సి ఉందని, వారం రోజుల్లో నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు కల్లా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు.