రూరల్ ఎంపీపీపై అనర్హత వేటు
మరో ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలపై కూడా
నేడు ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించనున్న వైస్ ఎంపీపీ అనురాధ
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు మునికృష్ణయ్యతోపాటు మరో ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలు సుధాకర్‌రెడ్డి, ఉషలపై అనర్హత వేటు పడింది. విప్ ధిక్కరించారనే ఆరోపణలపై విచారించిన తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 40 ఎంపీటీసీలు ఉన్నాయి. అందులో 21 టీడీపీ, 14 వైఎస్‌ఆర్ సీపీ, సీపీఎం 1, నలుగురు ఇండిపెండెంట్‌లు గెలుపొందారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల సమయంలో శెట్టిపల్లికి చెందిన మునికృష్ణయ్య, సాయినగర్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి, పద్మావతిపురానికి చెందిన ఉష, మరోముగ్గురు టీడీపీ ఎంపీటీసీలు విప్‌ను ధిక్కరించారని ఆ పార్టీ మండల విప్ ఈశ్వర్‌రెడ్డి అప్పట్లో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. మునికృష్ణయ్య అప్పట్లో ఎంపీపీగా గెలుపొందారు.
మునికృష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, ఉషపై విప్ ధిక్కరణ చేశారని, అనర్హత వేటువేయాలని మండల విప్ కోరారు. మరో ముగ్గురు టీడీపీ ఎంపీటీసీలపై మాత్రం అనర్హత వేటు నుంచి మినహాయించారు. విచారించిన ఆర్డీవో ఎంపీపీ మునికృష్ణయ్యతోపాటు మరో ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలపై అనర్హత వేటు వేశారు. అప్పట్లో వైస్ ఎంపీపీ కోసం జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చాకచక్యంగా చక్రం తిప్పి వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు, తన అనుచరుడు పొటేలు మునస్వామియాదవ్ భార్య అనురాధను వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యేటట్లు చేశారు.
నేడు ఎంపీపీగా అనురాధ బాధ్యతల స్వీకరణ
మునికృష్ణయ్యపై అనర్హత పడడంతో మల్లంగుంట వైఎస్‌ఆర్ సీపీ ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ పొటేలు అనురాధ బుధవారం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
తిరుపతి ఆర్డీఓపై విమర్శల వెల్లువ
టీడీపీ విప్ ధిక్కరించి మునికృష్ణయ్యను ఎంపీపీగా బలపరిచిన వ్యక్తులను వదిలేసి, ఓటు వేసిన వారిని ఎంపీటీసీ పదవుల నుంచి తొలగిస్తూ ఆర్‌డీఓ వీరబ్రహ్మం తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. గతంలో రూరల్ ఎంపీడీఓ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే తిరిగి అదే నిర్ణయాన్ని వీరబ్రహ్మం తీసుకోవడం చర్చనీయాంశమైంది. పెద్ద ఎత్తున కొందరి నుంచి ముడుపులు తీసుకుని న్యాయానికి, నిబంధనలకు విరుద్ధంగా విప్ ధిక్కరించిన ఆరుగురిలో ముగ్గురిపై మాత్రమే వేటు వేశారని సస్పెండైన సభ్యులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
న్యాయ పోరాటం చేస్తాం: మునికృష్ణయ్య
ఆరుగురిపై విప్ ధిక్కరణ ఫిర్యాదు చేసి, కేవలం ముగ్గురిపైనే అనర్హత వేటు వేయడం దారుణం. గతంలోనూ న్యాయస్థానం ద్వారా ఎంపీపీగా వచ్చా. మళ్లీ న్యాయపోరాటం చేస్తాం.